బాబుకు సలహాదారు చిట్టినాయుడే… సబ్బుతో స్నానం చేయించి ముద్దులు

Share Icons:

విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య మరోసారి ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. మొదట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమరావతి రాజధాని విషయంలో వారి తీరును తప్పుబడుతూ ట్వీట్ చేశారు. ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమానికి నిధులు సేకరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా జోలెపట్టి ప్రజల నుంచి విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

‘చంద్రబాబు నాయుడి ముఖ్య సలహాదారు చిట్టి నాయుడే అయి ఉంటాడని అనుకుంటున్నారంతా. గాజులు, ఉంగరాల సేకరణ నుంచి జోలె పట్టుకునే దాకా ‘రాజు గారి దేవతా వస్త్రాల’ కథ గుర్తు కొస్తోంది. తుపాన్లతో వేల కోట్ల నష్టం వాటిల్లినప్పుడు సైతం చేతులు చాపని వ్యక్తి ఇంతగా రగిలి పోవడం అలాగే అనిపించట్లేదూ?’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. జగన్ కు చిల్లర సలహాలు ఇచ్చే ముఖ్య సలహాదారుడు మీరే కదా? అని ఎద్దేవా చేశారు. తండ్రి శవాన్ని కూడా చూడకుండానే సంతకాలు పెట్టమని జోలె పట్టి అడుక్కునే సలహా ఇచ్చింది కూడా మీరే కదా? అని ప్రశ్నించారు. పెద్ద రోగంతో పోయిన వ్యక్తి కూడా మా మహా మేత కోసం పోయారంటూ బిల్డప్ యాత్ర సలహా కూడా మీదే కదా? అని అన్నారు.

పాదయాత్ర సందర్భంగా సబ్బుతో స్నానం చేయించి ముద్దులు ఇవ్వడం… పచ్చని పొలాలు, రైళ్లను తగలబెట్టి మొసలి కన్నీరు కార్చడం… డ్రామా కంపెనీని తలపించేలా యాక్షన్ సీన్లు… ఇలా ఒకటేమిటి అన్ని చెత్త పనులకు మీరే డైరెక్టర్ కదా విజయసాయిరెడ్డీ అంటూ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

Leave a Reply