దేవుడా…! వీరి విమర్శలకు హద్దు లేదనుకుంటా..

tdp mlc budda venkanna fires on vijayasaireddy
Share Icons:

అమరావతి: రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు మాత్రం తమ విమర్శలు ఆపడంలేదు. విజయసాయి టీడీపీ, చంద్రబాబుపై విమర్శలు చేస్తుంటే..బుద్దా వెంకన్న విజయసాయికి కౌంటర్లు ఇస్తున్నారు. ఈరోజు కూడా ఈ ఇద్దరు విమర్శలు ఆపలేదు. ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాల పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ ‘ఆంధ్రజ్యోతి’లో నిన్న కథనం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. గ్రామ సచివాలయం పరీక్ష రాసిన అభ్యర్థులతో ఏదో ఒక ఫిర్యాదు చేయించాలని టీడీపీ అనుకూల మీడియా పరీక్షా కేంద్రాల చుట్టూ తిరిగిందని విజయసాయిరెడ్డి విమర్శించారు.

కానీ ఎవరూ పరీక్షల నిర్వహణ తీరును తప్పుపట్టలేదని వ్యాఖ్యానించారు. దీంతో చివరికి తానే స్వయంగా పూనుకున్న చంద్రబాబు ప్రశ్నాపత్రం లీక్ అయిందని గొల్లుమంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇలా అంటారని ఊహించిందేనని, ఆయనలాంటి జ్ఞాని అలా అనకపోతే ఆశ్చరపోవాలని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబులను ట్యాగ్ చేశారు.

దీనికి బుద్దా వెంకన్న వెంటనే కౌంటర్ ఇచ్చారు. గ్రామ సచివాలయం పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని స్వయంగా ఏపీ పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన మాట నిజం కాదా? అని టీడీపీ నేత ప్రశ్నించారు. పేపర్ లీక్ కారణంగా ఉద్యోగాలు సంపాదించిన వారికి విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ లీకులతో ధైర్యం చెబుతున్నారని దుయ్యబట్టారు. కానీ ఇలాంటి చర్యలతో విజయసాయిరెడ్డి 18 లక్షల మంది నిరుద్యోగులను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి రాజకీయాల్లో ఆరితేరిన విజయసాయిరెడ్డికి నిరుద్యోగుల బాధ తెలియదని విమర్శించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో స్పందించారు.

కోడెల మరణంపై రచ్చ

ఆ తర్వాత విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ అంత్యక్రియల సందర్భంగా చంద్రబాబు తన ఈవెంట్ మేనేజ్ మెంట్ స్కిల్స్ ను అద్భుతంగా ప్రదర్శించారని సాయిరెడ్డి విమర్శించారు. ఇందుకు ఎల్లో మీడియా సహకారం అందజేసిందని చెప్పారు. కోడెలపై అంతకుముందు వర్ల రామయ్య వంటి నేతలను చంద్రబాబు ఉసిగొల్పారనీ, అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు పల్నాటి పులి అంటూనే కోడెలను తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేశారని దుయ్యబట్టారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి.. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీలను ట్యాగ్ చేశారు.

ఇక దీనికి కూడా బుద్దా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల మీరు చేసిన ‘బాత్రూంలో బాబాయికి గుండెపోటు’ ఈవెంటును కూడా బాగా రక్తి కట్టించారని… వైసీపీ శవ రాజకీయాలను చూసి ఇప్పటికే అనేక సార్లు ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు శకుని మామా అంటూ ఎద్దేవా చేశారు. ‘బెస్ట్ డెడ్ బాడీ ఈవెంట్ మేనేజర్లుగా మీ దొంగబ్బాయి జగన్ కి, మీకు అవార్డులు వచ్చిన సంగతి మర్చిపోయారా శకుని మామా?’ అని వ్యాఖ్యానించారు. మహామేత శవం దొరక్కముందే దొంగబ్బాయిని సీఎం చేయాలని మీ ఆధ్వర్యంలో జరిగిన సంతకాల సేకరణ, ఓదార్పు యాత్ర బెస్ట్ ఈవెంట్స్ గా నిలిచాయి కదా? అని అన్నారు.

 

Leave a Reply