అధికారికంగా బీజేపీతో…అనధికారికంగా టీడీపీతో: పవన్‌పై విజయసాయి ఫైర్

Share Icons:

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేనను చూసే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నోరు తెరిస్తే సిద్ధాంతాలంటూ సంబంధంలేని విషయాలేవేవో మాట్లాడే పవన్ కల్యాణ్.. ఎన్నికల పొత్తుల విషయంలో మాత్రం సైద్ధాంతిక విలువలు, నియమనిబంధనల్ని పాతరేశారని ఎంపీ విజయసాయి ఆరోపించారు.

ఒకవైపు అధికారికంగా బీజేపీతో కలిసుంటూనే.. ఇటు అనధికారికంగా టీడీపీతో సీట్ల సర్దుబాటు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. ‘‘పొత్తులకు కూడా కొన్ని విలువలు, నియమాలు ఉంటాయి. అటు బీజేపీతో అంటకాగుతూనే రెండోదిక్కు టీడీపీతో సీట్ల సర్ధుబాటు చేసుకున్న జనసేనను చూసి జనం పగలబడి నవ్వుకుంటున్నారు”అని ఎంపీ మండిపడ్డారు.

నిజానికి టీడీపీకి అభ్యర్థులు లేని చోటల్లా ఆయా స్థానాలను జనసేనకు వదిలేశామని పచ్చతమ్ముళ్లే బాహాటంగా చెబుతున్నారని, ఇంతగా దిగజారిన తర్వాతైనా జనసేన కనీసం ఒక్కటంటే ఒక్క మండల పరిషత్తులోనైనా కచ్చితంగా గెలుస్తుందని జనసేనాని చెప్పగలడా? అని సవాలు విసిరారు.

ఏపీలో ఎన్నికల ప్రక్రియను భ్రష్టుపట్టించిన ఘన చరిత్ర చంద్రబాబుదేనని, అలాంటి వ్యక్తి ఇవాళ.. ఎన్నికల్లో అక్రమాలు, అరాచకాల గురించి సుద్దులు చెప్పడం వింతగా ఉందని విజయసాయి మండిపడ్డారు. గతంలో వైసీపీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను బెదిరించి.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను గెలిపించుకున్న ఘటనల్ని అంత సులువుగా మర్చిపోగలమా? అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లాగే స్థానిక ఎన్నికల్లోనూ జనం వైసీపీకి పట్టం కట్టబోతున్నారన్న సంగతి అర్థమై, ఇక తాము గెలవలేమని నిర్ధారించుకున్న తర్వాతే బాబు, పవన్ లాంటివాళ్లు బురద చల్లే కార్యక్రమానికి పూనుకున్నారని విమర్శించారు.

ప్రతిసారి ఎన్నికలప్పుడు గెలవడం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతాడని, అదే అలవాటు ప్రకారం.. పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు కులాలను ఆపాదిస్తూ.. వాళ్లను అధికార పార్టీ సానుభూతిపరులుగా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నాడని, ఈ తప్పుడు ప్రచారాన్ని తన ఎల్లో మీడియా కమ్మగా వండివార్చుతుందని, తద్వారా ప్రజల్ని భ్రమింపజేయోచ్చనే ఆలోచన టీడీపీ అధినేతదని విజయసాయి ఆరోపించారు.

 

Leave a Reply