చంద్రబాబుకు గాయమైతే పవన్ అరుస్తారు..

Share Icons:

అమరావతి: మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు లక్ష్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి అవసరం లేదని, అది ఓ గుదిబండ వంటిదని, దాని రద్దు గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని, దాదాపు 37 సంవత్సరాల క్రితం ‘ఈనాడు’ దినపత్రికలో ప్రచురితమైన సంపాదకీయాన్ని గుర్తు చేసిన విజయసాయి రెడ్డి, పచ్చ మీడియాకు విధానాలు ఉండవని సెటైర్లు వేశారు. ఇప్పుడు విజయసాయి వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

“ఎల్లో మీడియాకు నిర్ధిష్ట విధానాలంటూ ఏముండవు. జాతి ఆశాకిరణం చంద్రబాబు ఏ లైన్ తీసుకుంటే దాన్ని అనుసరించడమే వాటికి తెలిసిన జర్నలిజం. అప్పట్లో కౌన్సిల్ దండగని ఎడిటోరియల్స్ రాసిన పచ్చ పత్రికలు ఇప్పుడు భిన్నంగా రాసి ‘జ్ఞానాన్ని’ వెదజల్లుతున్నాయి” అని ఆయన అన్నారు. కాగా, 1983, మార్చి 28, సోమవారం ప్రచురితమైనట్టుగా కనిపిస్తున్న ఈ ఎడిటోరియల్ వ్యాసంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్టు గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడటం గమనార్హం.

చంద్రబాబు నుంచి పవన్ ప్యాకేజీ తీసుకుంటారని, చంద్రబాబుకు గాయమైతే పవన్ అరుస్తారని ఆయన చురకలంటించారు. ‘దత్తపుత్రుడు అలియాస్ బెత్తం నాయుడి రియాక్షన్ ను ఎప్పటిలాగే సోషల్ మీడియా ముందుగానే ఊహించింది. చంద్రబాబుకు గాయమైతే ఆయన కంటే ముందే ఈయన అమ్మా అని అరుస్తాడు. నిమిషాల వ్యవధిలోనే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ప్యాకేజి తీసుకున్నవాడి బాధ్యత కదా!’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే అభివృద్ధిని అడ్డుకుంటూ, రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయిన శాసనమండలిని రద్దు చేయాలన్న తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని, రాష్ట్ర భవిష్యత్ కోసం తమ మంత్రి పదవులను వదిలేసుకునేందుకు సిద్ధమేనని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన వారిద్దరూ, మండలిలో సభ్యులుగా ఉండటం ఆవేదనను కలిగిస్తోందని తెలిపారు.

గతంలో ఎన్టీ రామారావు సీఎంగా ఉన్న వేళ, స్వల్ప ప్రయోజనాల కోసం రామోజీరావు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించి, మండలిని రద్దు చేశారని, కానీ ఇప్పుడు విస్తృత ప్రయోజనాల కోసం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పిల్లి సుభాష్ వ్యాఖ్యానించారు. అందరికీ నచ్చిన చోట రాజధాని పెట్టాలని నాడు శివరామకృష్ణన్ కమిటీ చెప్పగా, ఆ మాటను పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తప్పుడు నిర్ణయాలను సరిదిద్దేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు.

 

 

Leave a Reply