తండ్రికొడుకులకు పులివెందుల ఫోబియా…వణుకుతున్నారుగా

ysrcp mp vijayasai reddy comments on balakrishna son in laws
Share Icons:

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. ‘వైద్య శాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేని ఫోబియా తండ్రీ, కొడుకులకు పట్టుకుంది. ‘పులివెందుల ఫోబియా’ ఒకటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తక్షణం నోటిఫై చేయాలి. లేకపోతే ఎక్కడ ఇద్దరు వాదులాడుకున్నా అందులో ఒకరు పులివెందుల నుంచి వచ్చాడని వణికి చచ్చేట్టున్నారు!’ అని వ్యాఖ్యానించారు.

ఇక శుక్రవారం ట్వీట్ చేస్తూ…‘ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత చులకన భావమెందుకు చంద్రబాబూ? ఒక వైపు అమరావతి నుంచి రాజధాని తరలించ వద్దని ఉత్తుత్తి ఉద్యమాలు నడిపిస్తావు. మళ్లీ ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తావు. వారి ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటే ఇలాంటి శాస్తే జరుగుతుంది’ అంటూ మండిపడ్డారు.

‘ప్రజలు ఉమ్మేస్తారన్న సిగ్గు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు చంద్రబాబూ. నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రను పరిపాలనా రాజధాని చేయాలని సిఎం జగన్ గారు నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ బస్సు యాత్రకు బయలుదేరతావా? అమరావతి కోసం ఉత్తరాంధ్ర  ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా?’ అని విజయసాయి రెడ్డి మరో ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉంటే అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నిన్న విజయవాడలో తనిఖీలు చేసింది. టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సిట్‌ ప్రత్యేకాధికారి, ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం ఈ సోదాలు నిర్వహించింది. అలాగే, విజయవాడ పటమటలోని కొందరు కోటీశ్వరుల ఇళ్లను కూడా తనిఖీ చేసినట్లు తెలిసింది. వారిలో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు బంధువు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సోదాల్లో భాగంగా కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కులు, ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు బ్యాంకు లాకర్లను సిట్‌ స్వాధీనం చేసుకుంది.

ఈ క్రమంలో శనివారం కంచికచర్లలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కంచికచర్ల తెలుగుదేశం పార్టీ మార్కెటయార్డ్ మాజీ ఛైర్మన్ నన్నపనేని లక్ష్మీ నారాయణ ఇంటిలో సోదాకు వెళ్లారు. అయితే సీఐడీ వస్తుందన్న సమాచారం ముందుగానే తెలుసుకున్న లక్ష్మీనారాయణ ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో సీఐడీ అధికారులు ఆయన ఇంటి గుమ్మానికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. కాగా లక్ష్మీనారాయణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు.. చంద్రబాబు  హయాంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.

 

Leave a Reply