40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏమైంది…మందుబాబులు పొట్ట కొడుతున్నారా?

Share Icons:

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. మద్యం ధరలను పెంచి మందుబాబుల పొట్ట కొడుతున్నారంటూ రంకెలేస్తున్నారని మండిపడ్డారు. పీపీఏలను సమీక్షించి తక్కువ ధరకే కరెంట్ కొనుగోలు చేద్దామని ప్రభుత్వం భావిస్తుంటే అడ్డుపడతారని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పైనా దర్యాప్తు చేయవద్దంటారని దుయ్యబట్టారు. తన మాజీ పీఎస్ ఐటీ అధికారులకు అడ్డంగా దొరికితే కక్ష సాధింపు అంటారని విమర్శించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏమైందని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

అటు ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ”’మహామేత” అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిపై, 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, నలుగురు అధికారులతో విచారణలు, 1 సీబీసీఐడీ విచారణ చేయించారు. ఏమైంది?

గత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఐటీకి, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమన్నారు. ఏమైంది?’ అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారని… అది కూడా బాబాయ్ మర్డర్లు లాంటి కేసులను విచారణ చేయాల్సిన అధికారులతోనని లోకేశ్ విమర్శించారు. ఇక్కడ యువమేత ఆత్రం అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. సాధించేది ఏమీ లేనప్పుడు… సిట్ లతో కాలక్షేపం చేయడమే అవుతుందని అన్నారు. ఈమేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. దీనికి తోడు గతంలో పత్రికల్లో వచ్చిన వార్తలను షేర్ చేశారు.

ఇక రాష్ట్రంలో పెద్ద ఎత్తున వృద్ధులు, వికలాంగుల పెన్షన్లను తొలగించారని టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. గ్రామ వాలంటీర్లు బాధ్యతతో వ్యవహరించకుండా… ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారని అన్నారు. మంత్రులంతా డమ్మీలు అయ్యారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని… ప్రభుత్వం పిచ్చి పరాకాష్ఠకు చేరిందని అన్నారు. ప్రవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

 

Leave a Reply