Venu Madhav: బ్రహ్మానందంతో వేణు మాధవ్ గొడవపై క్లారిటీ.. అసలు విషయం బయటపెట్టిన కుటుంబ సభ్యులు

Share Icons:
సినీ నటుల మధ్య సంబంధాలు, వారి వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు ప్రేక్షకులు. అందుకే సినిమా వాళ్లు వారి వారి నిజ జీవితంలో ఒకరితో ఒకరు ఎలా మెలుగుతారనే విషయాలు హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా నటీనటుల మధ్య వివాదాలకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇదే కోవకు చెందింది దివంగత వేణు మాధవ్, స్టార్ కమెడియన్ మధ్య గొడవ. గత కోనేళ్ళుగా ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ ఇష్యూగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కుటుంబ సభ్యులు దీనిపై క్లారిటీ ఇచ్చారు.

వేణు మాధవ్ కన్నుమూసి ఏడాది
గతేడాది సెప్టెంబర్ 25వ తేదీన వేణు మాధవ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన అకాలమరణం యావత్ సినీ లోకాన్ని విషాదంలో ముంచెత్తింది. అయితే వేణు మాధవ్ మరణించి ఏడాది గడిచిన తర్వాత ఓ యూ ట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన భార్య శ్రీ వాణి, ఇద్దరు తనయులు తమ కుటుంబ విషయాలతో పాటు తోటి నటీనటులతో వేణు మాధవ్‌కి ఉన్న అనుబంధాన్ని గురించి ఓపెన్ అయ్యారు.

బ్రహ్మానందంతో వేణు మాధవ్ గొడవ
తన భర్త ఎంతో కష్టపడి ఆస్తి కూడబెట్టారని, పగలనక రాత్రనక ఎలాంటి పరిస్థితుల్లో అయినా షూటింగ్స్ అటెండ్ అయ్యేవారని చెప్పారు. ఆయన ప్రవర్తన తోటి నటులందరికీ నచ్చేదని, అందుకే అంతా అతనితో సరదాగా మెలిగేవారని అన్నారు. గత కొన్నేళ్లుగా అందరూ చెప్పుకుంటున్నట్లుగా వేణు మాధవ్-బ్రహ్మానందం మధ్య గొడవ అనేది లేదని, అవన్నీ రూమర్స్ మాత్రమే అని చెప్పారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కంటే సరదాగా తిట్టుకోవడమే ఎక్కువగా ఉంటుంది తప్ప ఎలాంటి గొడవలు లేవని అన్నారు. ఇండస్ట్రీలో వాళ్లిద్దరూ చాలా క్లోజ్ అని తెలిపారు.

వేణు మాధవ్-పవన్ కళ్యాణ్ ఒప్పందం
వేణు మాధవ్ పొలం నుంచి బియ్యం వెళితే పవన్ కళ్యాణ్ తోట నుంచి మామిడి పళ్ళు వస్తాయనేది నిజమే గానీ వారిద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం లేదని తెలిపారు. అది ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టం అంతే. దాన్ని మేము కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. ఆయనకు పవన్ కళ్యాణ్ కుటుంబానికి మధ్య అనుబంధం చాలా గొప్పది. నాగబాబు గారు ఎప్పుడూ ఫోన్ చేసి తమ యోగ క్షేమాలు అడుగేవారని వేణు మాధవ్ భార్య శ్రీ వాణి తెలిపారు.

డైరెక్టుగా షూటింగ్ స్పాట్‌లో..
తన తండ్రి ఎక్కువగా స్క్రిప్ట్ తన సొంత స్క్రిప్ట్ తోనే కామెడీ చేసేవారని, అలాగని ఇంట్లో ప్రాక్టీస్ అనేది చేసేవారు కాదని డైరెక్టుగా షూటింగ్ స్పాట్‌లో దిగిపోయేవారని వేణు మాధవ్ కొడుకులు సావికర్, ప్రభాకర్ చెప్పారు. మౌలాలి నుంచి బంజారా హిల్స్ లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి కారులోనే మేకప్ వేసుకోవడం, స్క్రిప్ట్ చదువుకోవడం లాంటివి పూర్తిచేసుకొని అక్కడ దిగిపోయేవారని తెలిపారు.