వెంక‌య్య‌జీ ఇంత క‌ష్టం ఎందుకు?

Share Icons:

వెంక‌య్య‌జీ ఇంత క‌ష్టం ఎందుకు?

రాజ్య‌స‌భ న‌డ‌ప‌డానికి ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ప‌డుతున్న క‌ష్టం చూస్తే గుండె త‌రుక్కుపోతున్న‌ది. ఆందోళ‌న చేస్తున్న ఎంపిల‌ను అదుపు చేయ‌లేక‌, వారిని స‌ముదాయించ‌లేక వెంక‌య్య‌నాయుడు ఎంతో శ్ర‌మ ప‌డుతున్నారు. స‌భా సాంప్ర‌దాయాల‌ను కాపాడాల‌ని ఆయ‌న ప‌డుతున్న త‌ప‌న చూస్తే కూడా ఎంతో ముచ్చ‌టేస్తున్న‌ది.

ఇలాంటి నాయ‌కుడు స‌భాధ్య‌క్షుడుగా లేక‌పోవ‌డం వ‌ల్ల ఇంత కాలం గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని అనిపిస్తూ ఉంటుంది. వెంక‌య్య నాయుడి లాంటి నిబ‌ద్ధ‌త గ‌ల నాయ‌కుడు అన్ని స‌భ‌ల్లో కూడా ఉంటే బాగుంటుంద‌ని అనిపిస్తుంటుంది.

వెంక‌య్య నాయుడు ఇప్పుడు రాజ్యంగ బ‌ద్ద‌మైన హోదాలో ఉన్నారు. చాలా సంతోషం. ఆయ‌న చాలా కాలం పాటు కేంద్రంలో మంత్రిగా కూడా ప‌ని చేశారు. అదీ కూడా అతి ముఖ్య‌మైన శాఖ‌ల‌నే నిర్వ‌హించారు. ఆయ‌న రాజ‌కీయ జీవితం చూస్తే అన్నీ క‌ష్టాలే. కాద‌న‌లేం.

మంత్రి ప‌ద‌వి లేదా ఇత‌ర బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌వులు నిర్వ‌హించిన స‌మ‌యం కూడా చాలా త‌క్కువ కాల‌మే. ఆయ‌న స‌మ‌కాలీన రాజ‌కీయ నాయ‌కుల‌తో పోలిస్తే పార్టీలు మార‌కుండా ఒకే పార్టీలో కొన‌సాగిన నాయ‌కుడు కూడా వెంక‌య్య నాయుడే.

జై ఆంధ్ర ఉద్య‌మం నుంచి ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం ఉజ్వ‌లంగా సాగింది. ప్ర‌తి ప‌క్ష పాత్ర పోషిస్తున్నా, ఆయ‌న పుట్టిన ప్ర‌దేశంలో లేని పార్టీ అయినా కూడా ఆయ‌న అవిభాజ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విశేష‌మైన రాజ‌కీయ ప్రాధాన్య‌త‌నే అనుభ‌వించారు. ఇంత‌టి విశేష‌ణాలు గ‌ల రాజ‌కీయ జీవిత వెంక‌య్య నాయుడిది. ఇది ఎవరూ కాద‌న‌లేనిదే.

ఇంత‌టి ఘ‌న చ‌రిత్ర ఒక ఎత్తు గ‌త ఆరు సంవ‌త్స‌రాల‌లో వెంక‌య్య నాయుడి జీవితంలో జ‌రిగిన ప‌రిణామాలు ఒక ఎత్తు. తెలంగాణ ఉద్య‌మం మ‌లి ద‌శ‌లో ఆయ‌న త‌న పార్టీ నిర్ణ‌యం మేర‌కు తెలంగాణ‌కు మ‌ద్ద‌తునిచ్చి త‌ను పుట్టిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చుల‌కన అయ్యారు. ఆ అప‌ప్ర‌ద నుంచి త‌న‌ను తాను కాపాడుకోవ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ర‌పున రాజ్య‌స‌భ‌లో వాదించారు.

త‌నకు రెండు ప్రాంతాలు స‌మాన‌మేన‌ని ఆయ‌న త‌ర‌చూ చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందేన‌ని ఆయ‌న త‌ర‌చూ అప్ప‌టిలో చెప్పేవారు. దీనికి ఆంధ్రా ప్రాంతం నుంచి వ‌స్తున్న‌వ్య‌తిరేక స్పంద‌న చూసిన త‌ర్వాత రాజ్య‌స‌భ‌లో మ‌రీ ముఖ్యంగా రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వ్య‌క్తిగానే మాట్లాడారు.

అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగే న‌ష్టం గురించే మాట్లాడారు. లోక్‌స‌భ‌లో విభ‌జ‌న బిల్లు పాస్ అయిన త‌ర్వాత రాజ్య‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడిన మాట‌లు అప్ప‌టిలో ఆంధ్రా ప్రాంతం వారిని ఎంతో సాంత్వ‌న ప‌రిచాయి. వెంక‌య్య నాయుడు లాంటి నాయ‌కుడు ఉంటే చాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విభ‌జ‌న త‌ర్వాత కూడా మ‌న‌గ‌లుగుతుంద‌ని భావించారు.

ప్ర‌త్యేక హోదా హీరో ఆయ‌నే క‌దా

రాజ్య‌స‌భ‌లో ఆయ‌న ప్ర‌త్యేక హోదాపై మాట్లాడిన మాటలు ఐదు సంవ‌త్స‌రాల త‌ర్వాత కూడా ప్ర‌తి ఆంధ్రుడి గుండెల్లో రింగు మంటున్నాయి. ప్ర‌త్యేక హోదా స్థాయిని పొడిగించాల‌ని ఆయ‌న చేసిన డిమాండు, అప్ప‌టిలో రాజ్య‌స‌భ‌లో బిజెపి నాయ‌కుడు అరుణ్ జైట్లీ చేసిన వాద‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లకు ఆనందం క‌లిగించాయి.

ఇప్ప‌టి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అప్పుడు బిజెపి ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నికల ప్ర‌చారం చేసిన‌పుడు ఆయ‌న ప్ర‌సంగాన్ని తెలుగులో త‌ర్జుమా చేసింది కూడా వెంక‌య్య నాయుడే. మోడీ కూడా ప్ర‌త్యేక హొదాపై ఏం చెప్పారో అంద‌రికి తెలుసు. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు కూడా అంద‌రికి తెలుసు.

కేంద్రంలో మంత్రి వ‌ర్గంలో ఉన్న స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తాను ద‌గ్గ‌రుండి చేసిన మేలును కేటాయించిన ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లను వెంక‌య్య నాయుడు ఏక‌రువు పెట్టారే గానీ ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడ‌లేదు. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌కు ప్ర‌త్యేక హోదా సంజీవిని కాదు అని కూడా ఆయ‌న సూత్రీక‌రించారు. ఆయ‌న వందిమాగ‌ధులు ఇవేవీ ఆయ‌న‌ను ప్ర‌శ్నించ‌లేరు.
కానీ ప్ర‌జ‌లు మాత్రం మ‌ర్చిపోలేదు.

ఇవ‌న్నీగ‌తం అనుకున్నా తాజాగా ఆయ‌న ఉప రాష్ట్ర‌ప‌తిగా ఉన్నారు. బిజెపికి ఆయ‌న రాజీనామా చేశారు. ఉప రాష్ట్ర ప‌తి ప‌ద‌వి త‌ర్వాత ఆయ‌న‌కు రాజ‌కీయంగా వ‌చ్చే ప‌ద‌వులు ఏమీ ఉండ‌వు. అయితే రాష్ట్ర‌ప‌తి కావాలి లేక‌పోతే అదీ లేదు. అంటే ఆయ‌న రాజ‌కీయ జీవితం ముగిసిన‌ట్లే భావించాలి. మ‌రి ఈ స‌మ‌యంలోనైనా గ‌త ఐదేళ్లుగా తాను మాట్లాడిన మాట‌లు వెంక‌య్య‌నాయుడికి గుర్తుకు రావ‌డం లేదా అనేదే ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కుడు కాదు క‌దా

ప్ర‌త్యేక హోదాపై ఆయ‌న చేసిన డిమాండు, కేంద్ర మంత్రిగా ఆయ‌న చేసిన క‌వ‌ర‌ప్‌, రాజ‌కీయ ప్ర‌తిబంధ‌కాలు, మోడీ ప్ర‌వ‌ర్త‌నా తీరు, మ‌రీ ముఖ్యంగా ఆయ‌న‌తో చాలా కాలం క‌లిసి ప‌ని చేసి ప్ర‌స్తుతం దేశానికి ఆర్ధిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు… ఇవేవీ వెంకయ్య నాయుడిని క‌దిలించ‌డం లేదా?

కేవ‌లం త‌న బాధ్య‌త రాజ్య‌స‌భ న‌డిపించ‌డం వ‌ర‌కే అని ఆయ‌న భావిస్తే మ‌నం చెప్ప‌గ‌లిగింది ఏదీ లేదు. ఆయ‌న ఎంతో గొప్ప‌వాడ‌ని కొంద‌రు ఆయ‌న ప్రాప‌కం కోసం చెప్పే మాట‌లు నిజాలు కావు. ప్ర‌త్యేక హోదాపై ఆయ‌న మాట్లాడిన మాట‌లు, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన ప‌నులు మాత్ర‌మే చ‌రిత్ర‌లో నిలిచిపోతాయి.

నెల్లూరు జిల్లాకే చెందిన పొట్టిశ్రీ‌రాములు లాగా చ‌రిత్ర‌లో నిలిచి పోవాలంటే వెంక‌య్య నాయ‌కుడు త‌క్ష‌ణ‌మే కొన్ని ప‌నులు చేయాలి. అవేవిటో మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇంకో ఏడాదిలో మ‌ళ్లీ ఎన్నిక‌లు రానున్నాయి. అప్పుడు రెడ్డెవ‌డో రాజెవ‌డో తేలిపోతుంది. ఆ లోపు వెంక‌య్య నాయ‌కుడు చేయాల్సిన ప‌నులు పూర్తి చేయాలి.

ఉప రాష్ట్ర‌ప‌తిగా ఉండి ఏం చేయ‌డానికి వీలు కాద‌ని ఎవ‌రైనా చెప్ప‌వ‌చ్చు. త‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచి పోవడానికి ఆ ప‌దవి అడ్డుగా ఉంటే అది మాత్రం ఎందుకు?

English Summery: The present Vice President of India Venkaiahnaidu is the strong supporter of special status for Andhra Pradesh before the 2014 Loksabha elections. Now Union Government declined the special status for Andhra Pradesh. What the present role of Venkaiah naidu as Vice President, belongs to no party.

2 Comments on “వెంక‌య్య‌జీ ఇంత క‌ష్టం ఎందుకు?”

Leave a Reply