మీ నివాసశైలి చూస్తే మీరు నిజాయితీ పరులు కాదని తెలుస్తుంది…

Share Icons:

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సీఎం జగన్‌లపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు చేశారు. ‘అయ్యా! విజయసాయి రెడ్డి గారు! మీరు, మీ నాయకుడు విశ్వసనీయతను, నిజాయతీని నమ్ముకుంటే, అంబాసిడర్ కార్లలో తిరుగుతూ, రెండు గదుల అద్దె ఇళ్ళల్లో నివసిస్తూ ఉండేవారు. మీ ప్రస్తుత నివాసశైలి నిజాయితీ పరులు కాదని, విశ్వసనీయత మీకు లేదని స్పష్టం చేస్తుంది’ అని విమర్శించారు. ఏవిధంగా ఆస్తులు సంపాదించారో చెప్పాలని అన్నారు.

ఇదిలా ఉంటే సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఈ రోజు మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏడు సార్లు జగన్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారని, వివరాలు వెల్లడించకపోతే ఏమనుకోవాలి? ఆయన కేసులకు సంబంధించి వెళ్తున్నారా? అని ప్రశ్నించారు.

ప్రధానితో ఎంత సేపు మాట్లాడారు? నిధులు ఏ మేరకు తెచ్చారు? అని నిలదీశారు.  బీజేపీ నేతలే పిలిచారా? లేక జగన్‌ నేరుగా వెళ్లారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావట్లేదని యనమల అన్నారు. అప్రజాస్వామిక చర్యలతో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావట్లేదని విమర్శించారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సరికాదని అన్నారు. భవిష్యత్తు తరాలకి అన్యాయం జరిగే విధంగా జగన్ నిర్ణయాలుంటున్నాయని విమర్శించారు. కియా సంస్థ వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

‘మూడు రాజధానులు కట్టమని ఎవరూ అడగలేదు. అయినప్పటికీ మూడు రాజధానులు అంటూ సొంతంగా నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో భూ కబ్జాలు మొదలు పెట్టారు.. దీనిపై విచారణ జరపాలి’ అంటూ డిమాండ్ చేశారు. ‘అధికార పార్టీ వారు ఎవరు భూములు కొంటున్నారు? ఎవరెవరు కబ్జాలు చేస్తున్నారు? నాయకుల స్వార్థంతో రాజధానిని, హైకోర్టును మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి సమయంలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించి, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు’ అని యనమల మండిపడ్డారు.

 

Leave a Reply