తెలంగాణ కీర్తిపతాక “వానమామలై వరదాచార్యులు”

Share Icons:

తెలంగాణ కీర్తిపతాక “వానమామలై వరదాచార్యులు”

తెలంగాణా ప్రాంతానికి చెందిన పండితుడు, రచయిత వానమామలై వరదాచార్యులు ప్రస్తుత వరంగల్ అర్బన్      జిల్లా, కాజీపేట మండలం మడికొండ గ్రామంలో 1912 ఆగష్టు 16 శ్రావణ బహుళ ఏకాదశిన జన్మించారు. తండ్రి బక్కయ్య శాస్త్రి ఆంధ్ర సంస్కృత భాషలలో ఉద్దండ పండితుడు. తల్లి సీతమ్మ. రైతు కుటుంబములో జన్మించిన వరదా చార్యులు ఏడవ తరగతి వరకు మాత్రమే పాఠశాల అభ్యాసం పూర్తయింది. అయినా సంస్కృతాంధ్ర సాహిత్యం, తార్కికం, వేదాంతం, వ్యాకరణాలను అధ్యయనం చేసారు. సంస్కృతం, తెలుగు, ఉర్దూ, హిందీ, ద్రవిడం, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో పట్టు సాధించారు. హరికథాగానంలో ప్రావీణ్యత సాధించారు. మేనమామ కొదుమగోళ్ల జగన్నాథాచార్య  కూతురు వైదేహిని 18వ ఏట వివాహమాడారు. ఈయన అగ్రజులైన వానమామలై వేంకటాచార్యులు, వానమామలై లక్ష్మణాచార్యులు, వానమామలై జగన్నాథాచార్యులు కూడా సాహిత్య కారులే.
ఈయన పాండిత్య ప్రతిభను గుర్తించి అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నిజామాబాద్ జిల్లా దోమకొండ జనతాకళాశాలలో వరదాచార్యులను సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకునిగా నియమించారు. అనంతరం ఈయన ఆంధ్ర సారస్వత పరిషత్తునుండి విశారద పట్టా పొంది, చెన్నూర్‌ ఉన్నత పాఠశాలకు బదిలీ అయి 13 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసి 1972లో పదవీ విరమణ చేశారు. చెన్నూరు తో ఏర్పడిన అనుబంధంతో అక్కడ ఒక వేదపాఠశాల నెలకొల్పారు. నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పి.వి. నరసింహారావు చొరవ, ప్రత్యేక ఆసక్తితో 1972 లో ఈయన శాసనమండలికి నామినేట్ అయి 1978 వరకు సభ్యునిగా కొనసాగారు. వరదాచార్యుల ప్రతిభ 13వయేటనే గుభాళించి పద్య రచన ప్రారంభించారు. 64పైగా రచనలు చేశారు.
1945లో మొదట మణిమాల (పద్యగేయకృతి) తో రచనలు మొదలై, ఆహ్వానము, శ్రీ సత్యనారాయణ వ్రతకల్పం, పోతన చరిత్రము (మహాకావ్యము), జయధ్వజం, విప్రలబ్ధ (గేయ కథా కావ్యం), స్తోత్ర రత్నావళి (అనువాద కావ్యం), భోగినీ లాస్యం (వ్యాఖ్యానం), గీత రామాయణం (అనువాద గేయ కావ్యం)….వంటి బహుళ రచనలు చేసి పాఠకుల ప్రశంసలు అందుకున్నారు.  అలంకార శాస్త్రం, శాకీర్ గీతాలు (అనువాదం), పోతన (బాలసాహిత్యం), మాతృప్రేమ, గేయ రామాయణము, భజ యతిరాజ స్తోత్రము, నరహరి నరసింహారెడ్డి జీవితచరిత్రము, దేశభక్తి… మొదలైన రచనలు వరదాచార్యులను కసిగా నిలబెట్టాయి. మణిమాల గ్రంథాన్ని ఆంధ్రసారస్వతపరిషత్తు ఆంధ్ర విశారద పరీక్షకు పాఠ్యాంశం చేసారు.వరదాచార్యులు తాను వ్రాసిన గ్రంథాన్నే పాఠంగా చదువుకుని విశారదలో ఉత్తీర్ణులు కావడం విశేషం. .విప్రలబ్ధ కావ్యం నుండి ‘వర్షాలు’ పద్యభాగాన్ని నాలుగవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా, .ఆరవ తరగతి తెలుగు వాచకంలో  ‘కుసుమోపదేశం’ పాఠంగా  చేర్చారు. పోతన చరిత్రములోని ‘భోగినీ లాస్యము’ ను యువభారతి కోసం వ్యాఖ్యాన సహితంగా అందించారు.                                                                                                            ఈయన ప్రతిభ,పాండిత్యాలకు…1968లో “పోతన చరిత్రము” గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ విశిష్ట సభ్యత్వం. 1973లో కరీంనగర్ జిల్లా కోరుట్లలో భారతీ సాహిత్య సమితి ‘గండ పెండేరం’, ‘స్వర్ణ కంకణం’, ‘రత్నాభిషేకం’, 1976లో సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం, వారణాసి నుంచి డి.లిట్ వాచస్పతి గౌరవ పట్టా… తదితరాలు అందుకున్నారు. వరదాచార్యులకు అభినవ కాళిదాసు, మహాకవి శిరోమణి, ఆంధ్ర కవిత ఉత్ప్రేక్ష చక్రవర్తి, అభినవ పోతన, ఆంధ్ర కవివతంస, మధురకవి, కవికోకిల, కవిశిరోవతంస.. ఆదిగాగల బిరుదులు లభించాయి.
ఈయన క్షయవ్యాధిగ్రస్థుడవడంతో 1949 – 1953  మధ్య మైసూరులో చికిత్స తీసుకున్నారు. ఊపిరి తిత్తులకు పలుమార్లు శస్త్రచికిత్స చేసి ఒక ఊపిరి తిత్తిని తొలగిించగా,  చిివరివరకూ ఒక ఊపిరి తిత్తితోనే జీవించారు. 1984 సంవత్సరం అక్టోబర్ 31దివంగతులయ్యారు. ప్రతి  కవి, రచయితకు ఈయన  స్పూర్తి ప్రదాత కావాలి.
-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply