బాబు…పోలవరంపై శ్వేతపత్రం ఏదీ?

Share Icons:

రాజమండ్రి, 2 జనవరి:

ఏపీ సీఎం చంద్రబాబు వరుసపెట్టి విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. . శ్వేతపత్రంలో వెల్లడించిన ఎల్‌ఈడీ బల్బుల కాంట్రాక్టులో భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఇక  ఇన్నింటిపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు.

60 సి నిబంధనను అడ్డుపెట్టుకుని పోలవరం పనుల్లో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను ఇష్టారాజ్యంగా కట్టబెడుతున్నారని, చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై ఆయనతో సహా ఎవరితో అయినా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఉండవల్లి సవాల్ విసిరారు. ఒకవేళ తన వాదన తప్పని తేలితే ఒప్పుకుంటానని… క్షమాపణలు కూడా చెబుతానని అన్నారు.

ఇక అమరావతి నిర్మాణంలో రాఫ్ట్ ఫౌండేషన్ అని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని… ఏపీలో ఇదివరకే రాఫ్ట్ ఫౌండేషన్ కట్టడాలు ఉన్నాయని ఉండవల్లి స్పష్టం చేశారు. 

అలాగే చంద్రబాబు తెలంగాణలో ప్రచారానికి వెళ్లకపోతే ఫలితాలు మరోలా ఉండేవని, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే… ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి కేంద్రంలో పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశం లేదన్నారు. ఏపీలో చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని… ఎన్నికల కోసమే ఆయన అనేక శంకుస్థాపనలు చేస్తున్నారని ఉండవల్లి విమర్శించారు.

మామాట: మరి పోలవరంపై కూడా శ్వేతపత్రం ఇస్తారేమో ఎదురు చూద్దాం…

Leave a Reply