జగన్ ని ఇప్పుడే జడ్జ్ చేయలేం…చంద్రబాబుకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి..

Share Icons:

అమరావతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, సీఎం జగన్ లపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ…తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ద్వేషం లేదని, చంద్రబాబును తాను కలిసేంతర వరకు తామిద్దరం ప్రత్యర్థులమేనని, ఆయనను కలిసిన తర్వాత తనకు ఇవాళ ఆయనపై ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని చెప్పారు. చంద్రబాబుతో తాను గడిపిన గంట వ్యవధిలో ఎన్నో గ్రహించానని, ఆయనలో చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయని అన్నారు.

పవన్ కల్యాణ్ తో తనకున్న సంబంధం వేరని, ముఖ్యమంత్రి జగన్ తన మిత్రుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడని చెప్పారు. జగన్ తో తనకు ఎక్కువ చనువు లేకపోయినా… ఆయన తనతో ఎప్పుడూ గౌరవంగానే ఉంటారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా జగన్ తనతో మంచిగానే ఉన్నారని చెప్పారు.

జగన్ వద్ద ఉండేందుకుగానీ, ఆయనకు సలహాదారుగాగానీ తాను పనికిరానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. తన మిత్రుడు వైఎస్ కుమారుడైన జగన్, ముఖ్యమంత్రి కావడం తనకెంతో సంతోషకరమని అన్నారు. జగన్ పాలన మొదలై ఐదు నెలలు మాత్రమే అయిందని, ఇంత స్వల్ప కాలానికే ఓ వ్యక్తిని జడ్జ్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.  పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడిగా మారాడని, అయితే, ఆయన చంద్రబాబుకు దగ్గరగా ఉన్నారని ప్రజలు నమ్మడంతోనే గత ఎన్నికల్లో ఆయన పార్టీకి ఓట్లు, సీట్లు దక్కలేదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. తానిప్పుడు ఎవరి పక్షానా లేనని, వివిధ అంశాలపై మాత్రం స్పందిస్తున్నానని చెప్పుకొచ్చారు.

ఇక దేశ వ్యాప్తంగా ఇప్పుడు బీజేపీ హవా నడుస్తోందని, అయితే, ఇది ఎల్లకాలమూ ఉండబోదని ఉండవల్లి అంచనా వేశారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు అత్యంత కఠిన రాజకీయ నాయకులని, తామనుకున్నది చేసుకుంటూ వెళ్లడమే తప్ప వారికి మరొకటి తెలియదని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి, ఆ విషయమై దేశ ప్రజలను ఒప్పించగలిగారని, మరొకరికి ఈ పని సాధ్యమయ్యేది కాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా బీజేపీ కేంద్రంలో ఉంటే అసాధ్యమని అన్నారు.  జగన్ పై ఉన్న 11 కేసుల విషయంలో బీజేపీ ఏం అనుకుంటే అదే జరుగుతుందని అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. శశికళ విషయంలో ఏం జరిగిందో అందరమూ చూశామని, మెజారిటీ ఎమ్మెల్యేలను తీసుకువచ్చి, ఆమె తాను ముఖ్యమంత్రిని అవుతానని అంటే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకూ వేచి చూడాలని చెప్పారని, ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని అన్నారు.

 

Leave a Reply