పెడమార్గం లో యువశక్తి

Share Icons:

పెడమార్గం లో యువశక్తి

సమాజానికి, దేశానికి, జాతికి, సాహిత్యానికి గొప్ప మేలు చేసినప్పుడే ఒక వ్యక్తిని మహాత్ముడని, మహనీయుడని, మహాపురుషుడని ప్రజలు భావిస్తారు. అంతకు పూర్వం లేని కొత్త వికాసాన్ని, పరిణామాన్ని, సమాజహితాన్ని ఆ వ్యక్తి సాధించినప్పుడు ఆ జాతి జనులకు ఆయన చిరస్మరణీయుడంటాము. దేశంలో యువశక్తి రానురాను పెడమార్గం పడుతున్నది. ఎందరెందరో యువతీ యువకులు నిరుద్యోగంతో కుమిలిపోతున్నారు, అర్ధాకలితో అలమటిస్తున్నారు. సామాజికంగా అన్యాయాలను, అక్రమాలను తట్టుకోలేక తల్లడిల్లుతున్నారు. అటువంటి దుర్భర పరిస్థితులలో అరాచకం వైపుకు మళ్ళి దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు, మోసాలు మొదలైన వాటికి పాల్పడుతూ అసాంఘిక శక్తులుగా తయారవుతుండగా, మరికొందరు విప్లవం అంటూ పిడికిలి బిగించి, ఎలుగెత్తి నిసదించి తిరుగుబాటుదారులవుతున్నారు. టెర్రరిస్టులు, నక్సలైట్లుగా మారిపోతున్నారు. మరి కొందరు కుల, మత, వర్గ, ప్రాంతీయ, రాజకీయాలపై ఆధారపడే కుహనా ప్రజానాయకుల పద్మవ్యూహాలలో బలైపోతున్నారు. అదుగో – అటువంటి యువతకు ఊరడింపు కల్పించడానికి, స్వయం ఉపాధి పథకాలను అమలుపరుచుకొని వారు సజావుగా బ్రతకడానికి, తలెత్తుకుని ధీరులుగా మసలడానికి సామాజిక కృషి అవసరం.

యువశక్తే దేశానికి రక్ష. భారతదేశ సమగ్రతకు, జాతి సమైక్యతకు యువత జీవగర్ర. వారిని సమీకరించవలసి ఉంది. పెడమార్గం పట్టి సమిధలైపోతున్న యువతీ యువకులలో ఆత్మ విశ్వాసాన్ని, ధైర్యస్థయిర్యాలను కల్పించాలి. తమ కాళ్ళపై తాము నిలవగలిగే జీవనాధారాలను చూపాలి. అప్పుడు వారు నిజమైన మానవులుగా సామాజిక బాధ్యతలను పంచుకుంటారు. అందుకే, వారి కోసం ఏదైనా ఒక మంచి పనిచేసి, అటువంటివారికి వెసులుబాటు కల్పించి, పోరుబాట నుంచి మళ్ళించి, ప్రగతి పధాన నిలపాలి. యువశక్తి నిర్వీర్యం కాకుండా చూడడం ఒక్క ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం కాదు.  ఇందుకు ప్రజలు కలిసిరావాలి స్వచ్చంద ప్రజాహిత సేవా సంస్థలు పూనుకోవాలి, సంపన్నులు నడుం బిగించాలి. విజ్ఞులు మార్గదర్శకులు కావాలి. ఈ దేశం తనకు ఏమి ఇచ్చింది అనికాక తన దేశానికి తను ఏమి ఇస్తున్నట్టు అని ప్రతి పౌరుడు పునరాలోచించుకోవాలి.

కెరటాలపై తేలుతూ, ఆటుపోట్లను  ఎదుర్కొంటూ, నీటి మీద నిలదొక్కుకుంటూ, నావ గమ్యం  చేరడానికి చుక్కాని మీద నియంత్రణ ఎంత  అవసరమో…మనిషి జీవితంలో కూడా కష్ట, సుఖాలను ఎదుర్కొంటూ, ఆనందడోలికల్లో  తేలియాడుతూ గమ్యాన్ని/లక్ష్యాన్నిచేరడానికి “ఆలోచనల” మీద  నియంత్రణ కూడా అంతే అవసరం..మానవ జీవితాన్ని  దిశా, నిర్దేశం  చేసేది, ముందుకు నడిపే చుక్కాని కూడా “ఆలోచన” లేదా “ఆలోచనల సముదాయమే” ఈ జీవిత అనుభవాల పరంపరలో నేర్చుకునే నీతి, తెలుసుకోవలసిన సత్యం అన్నిటికి మూలం ఆలోచనే!

ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా సాధించాలంటే దాని గురించి ప్రతి క్షణం లేదా ఎక్కువ సేపు ఆలోచించగలిగితే చాలు.. ఖచ్చితంగా  అనుకున్నది సాదించగలిగే శక్తీ, యుక్తితో పాటు అనుకున్నది తొందరగా  సాదించటానికి వీలవుతుంది. అది చదువు, ఉద్యోగం, స్నేహం,  ప్రేమ, లక్ష్యం ఏదైనా కావొచ్చు, మరేదైనా కావొచ్చు… అది ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా కావొచ్చు,  విజయం నీ ముంగిట అనతికాలంలోనే రెక్కలు కట్టుకొని వాలుతుంది.  మానవ జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దోకోవడానికి  కావాల్సిన ఒకే ఒక ఆయుధం “ఆలోచన” … ఆలోచనలు మంచివైతే పయనం మంచి వైపు… ఆలోచనలు  చెడువైతే దారి చెడువైపు…

ఆలోచనలు మాటలుగా; మాటలు చేతలుగా; చేతలు ఇస్టాలుగా; ఇష్టాలు అలవాట్లుగా, ఆచరనలుగా, అలవాట్లు స్వభావాలుగా  (వ్యక్తిత్వంగా), స్వభావాలు తలరాతలుగా పరివర్తన చెందుతాయి..అంటే ఒక్క ఆలోచనల సమాహారమే జీవితాన్ని నడిపే ఆయుధం… మాటే మనం సృష్టించుకొనే ప్రపంచం. అందువల్ల చెడు ఆలోచనలను నియంత్రించుకో, మంచి ఆలోచనలను పెంపోదించుకో, ఆనందకరమైన పరిసరాలను సృష్టించుకో, మహోన్నత వ్యక్తిత్వాన్ని అవలంబించుకో, మంచి సమాజాన్ని సృష్టించుకో, అందరికి ప్రేమను పంచుతూ..అందరికి సేవ చేసుకొంటూ.. జీవిత లక్ష్యాన్ని చేరుకో… జీవిత సమరంలో కష్టాల్, సుఖాల్, దుఖాల్ ఏమి ఎదురైనా మొక్కవోని దైర్యంతో, మంచి ఆలోచనలతో లక్ష్యాన్ని చేరుకో… ఈ ప్రపంచాన్ని అంతటా ప్రేమను పంచే ఒక ఆనందకరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దుకో…. ఇందుకు నీ  వంతుగా మంచి ఆలోచనలు అభివృద్ధి  చేసుకో….

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply