పోల్ నెం.20- ఉక్కు జిమ్మిక్కుల కిక్కు

Share Icons:

రాష్ట్ర విభజన హామీలను సాధించాల్సిన ప్రభుత్వ౦ గత నాలుగు సంవత్సరాలుగా అనేక వివాదాలకు కారణమౌతోంది. ఎందుకు ఇలాజరుగుతోంది?
వీటి వలన పాలక పక్షం సాధించదలుచుకున్నది ఏమిటి?

[pinpoll id=”58457″]

తెలుగు నేల రెండు ముక్కలుకావడానికి ఎవరు కారణం? నాటి రాజకీయ నాయకులకందరికీ ఆ పాపంలో తలా పిడికెడు వాటా ఉంది. విభజన సమయంలో రెండు కళ్ల సిద్దాంతం వికటించింది. సరే, తెలంగాణా సెంటిమెంటు ముందు మన నే(మే)తల విచక్షణ నీరుగారిందనుకున్నా, ఆ తరువాత విభజన హామీలను సాధించుకోవడంలో అంధ్రప్రదేశ్ పాలకులు చిత్తశుద్ధి కనపరిచారా? రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడుతున్న రాజకీయాలు రాష్ట్రానికి మంచి చేస్తాయా? చేటు కలిగిస్తాయా? ఒక తలా తోకా లేకుండా రాష్ట్ర విభజన జరిగిందనీ, ఆ విపత్కర పరిస్థితులలో పాలనానుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా రావడం ప్రగతికి ఉపకరిస్తుందని భావించిన ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారు. బాబు వస్తే అందరికీ జాబ్ వస్తుందని ఊదర గొట్టిన తెలుగు దేశం మద్దతుదారులు ఇపుడు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నాలుగు సంవత్సరాల బాబు పాలనలో రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని అందరికీ తెలుసు.

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఎందుకు కేంద్రంతో లౌక్యంగా వ్యవహరించలేకపోతున్నారు.

ప్రతి అంశాన్నీ రాజకీయం చేసి, తెగే వరకూ లాగి, గోరంతలు కొండంతలుగా ప్రచారం చేసి, అవసరం ఉన్నా లేకున్నా ప్రజల్లో ఆవేశాలు రగిలించే ప్రయత్నం చేస్తున్నారు? ప్రత్యేక హోదా విషయంలో, విశాఖ రైల్వే జోన్ విషయంలో, తాజాగా కడప ఉక్కు విషయంలో ఇన్ని జిమ్మిక్కులు ఎందుకు చేస్తున్నరో.. ? కడప ఉక్కు కోసం దీక్ష చేపట్టిన తెలుగు దేశం నాయకుడు సీఎం రమేష్ ఈ విషయంపై అనేక మార్లు మాట మార్చడం మనం చూశాం. ఇక తెలుగు దేశం పార్టీ కూడా సమయానుకూలంగా సన్నాయి నొక్కులు నొక్కిన విషయం తెలుసు. ఒక వైపు టీడీపీ నాయకుడు దీక్ష చేస్తారు.. మరో వైపు ఆ పార్టీ నేతలే దీక్షపై జోకులు పేలుస్తుంటారు. పైగా సాటి నాయకుని దీక్షను కించపరిచే విధంగా మాట్లాడిన వారిపై చంద్రబాబు ఎటువంటి చర్యలూ తీసుకోరు. కానీ ఆ వీడియో ఎలా బయటికి పొక్కిందో దర్యాప్తు చేయిస్తారట. ఇదెట్లా ఉందంటే మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు చూసినందుకన్నట్టుంది.

ఏమిటిదంతా అని అడిగేవారు లేరా రాష్ట్రంలో.. కడప ఉక్కుపై కేద్రం చెబుతున్నది ఏమిటి? అసలు విభజన చట్టంలో ఉన్నదేమిటి? రాష్ట్ర ప్రభుత్వం వాదన ఏమిటి? ఒక క్లారిటీ లేని వింత పరిస్థితిని సృష్టించింది ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా, ఆయన సారథ్యంలోని తెలుగు దేశం పార్టీ కాదా? ఎందుకిదంతా జరుగుతోంది. ప్రభుత్వమే స్వయంగా దీక్ష చేయిస్తుంది. కేంద్రం ఏ విషయమూ ప్రకటించక ముందే స్వయంగా ముఖ్యమంత్రే వచ్చి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తారు. తాజాగా టీడీపీ కడప ఉక్కుకోసం చేసిన దీక్ష వలన ఏమి ఫలితం వచ్చింది?.. ప్రజలకు జవాబు చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ప్రజలు ఈ ధోరణిని సమర్థిస్తున్నారా, కడప ఉక్కుకోసం తెలుగుదేశం చేస్తున్న హడావుడిలో చిత్తశుద్ధి ఉందా? అంతిమ ఫలితం దేనికోసం బాబు ఆరాటపడుతున్నారో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. కనికట్టు చేసి, జిమ్మిక్కులతో కాలం వెళ్లదీస్తే… ఏడాది తరువాత పరిస్థితి.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుంది.

మామాట: ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు వంచన పాలకుల నైజంగా మారినట్టుంది.

 

Leave a Reply