తిరుగుబాటు వీరులు

Share Icons:

తిరుగుబాటు వీరులు

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రూ ఒకే సారి తిరుగుబాటు చేయ‌డం యాదృచ్చిక‌మా? లేక దాని వెనుక ఏదైనా లెక్క ఉందా? ఈ ప్ర‌శ్న మిమ్మ‌ల్నో న‌న్నో కాదు, క‌మ‌ల‌నాధులంద‌రిని వేధిస్తున్న‌ది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బిజెపి మిత్ర‌ప‌క్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ది. తెలంగాణ‌లో బిజెపితో సంబంధం లేకుండానే ఎన్నిక‌ల్లో గెలిచిన టిఆర్ ఎస్ అధికారంలో ఉన్న‌ది. తెలంగాణ‌లో బిజెపి ప్ర‌తిప‌క్షంలో ఉండి టిఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న‌ది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అలా కాదు.

మిత్ర ప‌క్షం అధికారంలో ఉన్నా బిజెపి పోరాటం చేస్తున్న‌ది. బిజెపి తెలుగుదేశం పార్టీలు ఇటీవ‌లి కాలంలో క‌త్తులు దూసుకుంటున్నాయి. దేశ‌వ్యాప్తంగా బిజెపికి ఉన్న బ‌ల‌మైన మిత్రులు ఒక్కొక్క‌రుగా వెళ్లిపోతున్నారు.

అయినా బిజెపి మాత్రం అంద‌రిని వెళ్ల‌గొట్టేందుకేనా అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్న‌ది. ఉన్న మిత్రుల‌నే వెళ్ల‌గొట్టుకుంటున్న బిజెపి ఇక కొత్త మిత్రుల్ని సంపాదించుకునేది ఎప్పుడు? బిజెపితో ఇంత కాలం న‌మ్మ‌కంగానే ఉండి, అంశాల వారీగా మ‌ద్ద‌తునిచ్చిన టిఆర్ ఎస్‌తో కూడా బిజెపి సున్నం పెట్టుకుంటున్న‌ది.

దాంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు బిజెపిపై తిరుగుబాటు బావుటా ఎగుర‌వేస్తున్నారు. ఇద్ద‌రి తిరుగుబాటుకు కార‌ణాలు వేరైనా చేస్తున్న ప‌ని ఒక్క‌టే కావ‌డంతోనే ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

తెలుగుదేశం పార్టీ బిజెపిని వ‌ద‌ల్లేని నిస్స‌హాయ స్థితిలో ఉంద‌నేది ఇప్ప‌టి వ‌ర‌కూ క‌మ‌ల‌నాధులు వేసుకున్న లెక్క‌. ఎటూ ఎక్క‌డికీ పోలేదు క‌దా అని తెలుగుదేశం పార్టీ ప‌ట్ల బిజెపి చిన్న చూపు చూసింది. నిజానికి బిజెపిని వ‌దిలితే త‌మ‌కు న‌ష్ట‌మేన‌ని ఇంత‌కాలం తెలుగుదేశం పార్టీ కూడా భావించింది.

అందుకు కార‌ణాలు ఏవైనా తెలుగుదేశం పార్టీ నిస్స‌హాయ స్థితిలో ఉంద‌నేది మాత్రం వాస్త‌వం. బిజెపి నుంచి దూరంగా జ‌రిగి ఏం చేయాలి అనేది కూడా తెలుగుదేశం పార్టీ ని వేధిస్తున్న ప్ర‌శ్న‌. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో క‌లిసి వెళ్ల‌లేదు.

ఇప్ప‌టిలో మూడో ఫ్రంట్ వ‌చ్చే అవ‌కాశం లేదు. ఏం చేయాల‌నే మీమాంశలో కూడా ఇంత కాలం తెలుగుదేశం పార్టీ స్త‌బ్దుగా ఉండిపోయింది.

జాతీయ స్థాయిలో చాలా రాష్ట్రాల్లో బిజెపి అప్ర‌తిహ‌త విజ‌యాలు సాధిస్తున్నా కూడా ఆ పార్టీ కి దేశంలోని చాలా ప్రాంతాల్లో వ్య‌తిరేక‌త పెరిగిపోతున్న‌ద‌నే వాస్త‌వాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించినందునే ఈ విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ద‌నేది రాజ‌కీయ ప‌రిశీల‌కుల అంచ‌నా.

మ‌రీ ముఖ్యంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు బిజెపికి వ్య‌తిరేకంగా మారిపోయి ఉన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అయితే ప్ర‌త్యేక హోదా అంశాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా బిజెపి వైపు నెట్టి ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు బిజెపి అంటే అస‌హ్యం మ‌రింత పెరిగేలా చేశారు.

ఇలా చేయ‌డం వ‌ల్ల తెలుగుదేశం పార్టీ రెండు అంశాల‌ను దృష్టిలో పెట్టుకున్న‌ది. ఒక‌టి- వివిధ కార‌ణాల వ‌ల్ల త‌మ కార్య‌శీల‌త‌లో వ‌చ్చిన లోపాల‌ను క‌ప్పిపుచ్చుకుని వాటిని బిజెపికి బ‌ద‌లాయించ‌డం, రెండు బిజెపిపై గూడుక‌ట్టుకుని ఉన్న వ్య‌తిరేక‌త నుంచి త‌మ‌ను తాము ర‌క్షించుకోవ‌డం.

బిజెపి వైపు వెళ్ల‌లేని వైఎస్ ఆర్ కాంగ్రెస్‌

ఇలా చేయ‌డం ద్వారా త‌మ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి అయిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బిజెపి వైపు వెళ్ల‌లేని ప‌రిస్థితిని తెలుగుదేశం పార్టీ సృష్టించింది. అందువ‌ల్ల బిజెపికి ఎటూ లాభం లేని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను మ‌రింత దూరం జ‌ర‌ప‌డంలో తెలుగుదేశం పార్టీ కృత‌కృత్య‌మైంది. ఇది త‌మ‌కు లాభిస్తుంద‌ని తెలుగుదేశం పార్టీ భావిస్తున్న‌ది. అదే విధంగా తెలంగాణ‌లో ముస్లిం ఓట్లు ఎక్కువ‌.

ఇప్పుడు ఎన్నిక‌లు రానున్న త‌రుణంలో బిజెపిపై తిరుగుబాటు బావుటా ఎగుర‌వేయ‌డం ద్వారా ఆ ఓటు బ్యాంకును ప‌దిల‌ప‌ర‌చుకోవ‌చ్చున‌నేది టిఆర్ ఎస్ వ్యూహం. ఎటూ దూరం పాటిస్తున్నందున ఇప్పుడు మ‌రింత దూరం జ‌ర‌గ‌డం వ‌ల్ల టిఆర్ ఎస్‌కు లాభ‌మే త‌ప్ప న‌ష్టం వాటిల్ల‌దు. తెలంగాణ విష‌యం వ‌చ్చే స‌రికి బిజెపినే ఇర‌కాటంలో ఉంది.

ఇక్క‌డి అధికార పార్టీపై పోరాటం చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుంది. అందువల్ల పోరాటం చేయ‌లేని ప‌రిస్థితి. మౌనంగా ఉంటే మ‌రింత న‌ష్టం. ఇవ‌న్నీ చూసి ఒక్క సీటు కూడా రాని ఆంధ్ర‌, తెలంగాణ పై అస‌లు మ‌నం దృష్టి సారించ‌డం అవ‌స‌ర‌మా అనే స్థితికి బిజెపి అధిష్టాన వ‌ర్గం చేరుకున్న‌ది.

ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు తిరుగుబాటు చేయ‌డం వ‌ల్ల బిజెపికి ఎక్కువ న‌ష్టం వ‌చ్చేది ఎక్క‌డంటే అది జాతీయ స్థాయిలో ఒన‌గూర్చే మార్పులు.

ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు ఇదే విధ‌మైన బిజెపి వ్య‌తిరేక వైఖ‌రి రానున్న రోజుల్లో మ‌రింత బ‌లంగా ముందుకు తీసుకువెళితే జాతీయ స్థాయిలో బిజెపికి, కాంగ్రెస్‌కు ప్ర‌త్యామ్నాయం ఏర్ప‌డ వ‌చ్చు.

ఒక వేళ న‌రేంద్ర మోడీకి గ‌త ఎన్నిక‌ల‌లో మాదిరిగా పూర్తి స్థాయి మెజారిటీ రాక‌పోతే ఈ ముఖ్య‌మంత్రుల ద్వ‌య‌మే కీల‌క పాత్ర పోషించే ప‌రిస్థితి రావ‌చ్చు.

English Summery: TDP is believed to be a credible alloy of BJP once. Now the position has been changed. TDP seems to go independently in the coming elections. TRS till now extending conditional support to the ruling BJP at center, but now it changed its ideas.

Leave a Reply