మద్యం డీ-అడిక్షన్ సెంటర్‌కు చంద్రబాబు… మనీ డీ-అడిక్షన్ సెంటర్‌కు జగన్

tdp mlc budda venkanna fires on vijayasaireddy
Share Icons:

అమరావతి: ఎప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా ట్విట్టర్‌లో విమర్శలు చేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.” మద్యం ధరలు పెంచినా ఆదాయం ఎందుకు పెరగడం లేదని చంద్రబాబు గోల పెడుతున్నాడు. బిజినెస్ మైండ్ కదా? ప్రతిదీ లాభనష్టాల కోణంలోనే చూస్తాడు. రేట్లు పెంచింది రాబడి కోసం కాదు బాబూ. తాగడం తగ్గించడం కోసం. సీఎం జగన్ గారు జిల్లాకో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయించారు. మీరూ నిరభ్యంతరంగా చేరొచ్చు” అంటూ తీవ్రమైన విమర్శ చేశారు.

అటు విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘విజయసాయిరెడ్డి గారు మీ ప్రతాపం ట్విట్టర్ లో కాదు.. మద్యం దుకాణం ముందు నిలబడి చూపించండి. మద్యపాన నిషేధం పేరుతో కోట్లు కొల్లగొడుతున్న జగన్ గారిది బిజినెస్ మైండ్ కాదు క్రిమినల్ మైండ్’ అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో బ్రాండ్ల దందా మొదలు పెట్టిన మీరు మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నారా? సిగ్గుగా లేదా? మద్యపాన నిషేధం అమలై అందరూ తాగడం మానేశారు అని డప్పు కొడుతున్నారు. మరి మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎలా పెరుగుతుంది సాయిరెడ్డి గారు?’ అని ప్రశ్నించారు. ‘తప్పుడు లెక్కలు రాసే మీరే ఈ లాజిక్ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో చెప్పాలి. జగన్ గారికి, మీకు డబ్బు పిచ్చి పోగొట్టేలా మనీ డీ-అడిక్షన్ సెంటర్లు పెట్టించుకోండి కాస్త ఉపయోగం ఉంటుంది’ అని బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత  దేన్నయినా రద్దుతో సరిపెట్టడం మీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే చెల్లిందని టీడీపీ సీనియర్‌ నేత బుచ్చయ్యచౌదరి ఎంపీ విజయసాయిరెడ్డికి చురకంటించారు. తుపాన్లను నిరోధించగల అతీంద్రయ శక్తులు ఉన్న టీడీపీ అధినేత చందద్రబాబు నాయుడు కరోనా వైరస్‌ నియంత్రణకు తక్షణం ఏదో ఒకటి చేస్తారని ప్రపంచం ఎదురు చూస్తోందని, ఆయన మందు కనుక్కోకుంటే ఈ భూమ్మీద మనుషులు మిగలరని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే కరోనా లాంటి వైరస్‌కి మందుకనుక్కొనే ప్రయత్నమైనా చేసేవారని, మీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మందుతో పనిలేదు కాబట్టి ఏకంగా రద్దు చేసేస్తారని సెటైర్ వేశారు.

 

Leave a Reply