తుంగభద్ర, శ్రీశైలంలో నీరు పుష్కలం

Share Icons:

అనంతపురం, నవంబర్ 25:

ఎప్పటిలాగానే కరువు అనంతపురం జిల్లాలో నెలకొన్నప్పటికీ… కొంతలో అయినా తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల్లోకి నీరు పుష్కలంగా వచ్చాయి. దీంతో అదనపు జలాలు ఇక్కడికి తెచ్చుకునే వీలు కలిగింది. అయితే ఈ నీటిని ఏ మేరకు సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అటు హంద్రీనీవా, ఇటు హెచ్‌ఎల్‌సి రెండింటి ద్వారా జిల్లాకు ఇప్పటి వరకు వచ్చిన నీరు 32.50 టిఎంసిల వరకు ఉంది.

ఇంతనీరు వచ్చినా రైతుల్లో ఆందోళనలు మాత్రం తప్పడం లేదు. సక్రమంగా నీరందండటం లేదని రోడ్డుకెక్కుతున్నారు. వీరికి మద్దతుగా ప్రజాప్రతినిధులు సైతం ఆందోళనలు చేపడుతున్నారు. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు శ్రీశైలం డ్యాం నుంచి హంద్రీనీవా ద్వారా 25 టిఎంసిల వరకు పంపింగు చేస్తే, అందులో 15 టిఎంసిల వరకు జిల్లాకు చేరింది. ఇక తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా 20 టిఎంసిల వరకు విడుదల చేస్తే 17.50 టిఎంసిలు చేరింది. రెండు కలిపితే 32.50 టిఎంసిల నీరు జిల్లాక చేరింది. అయితే పంపిణీలో వైఫల్యాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. అయితే ఇందులో మిడ్‌పెన్నార్‌ దక్షిణ కాలువ కింద ఆయకట్టుకు నీరు విడుదల చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటి కిందనున్న డిస్ట్రిబ్యూటరీలకు విడుదల చేయకపోవడంతో రైతులు పంటలు సాగు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారు.

Image result for srisailam dam

తుంగభద్ర నుంచి హెచ్‌ఎల్‌సికి వస్తున్న నీళ్లలో అత్యధికం ప్రవాహ నష్టమే అధికంగా ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాకు తుంగభద్ర నుంచి విడుదల చేసింది 20.74 టిఎంసిలు అయితే 8.106 టిఎంసిలు ప్రవాహనష్టంగా చెబుతున్నారు. అంటే మొత్తం వచ్చిన నీటిలో 39 శాతం నష్టంగా చూపుతుండటం గమనార్హం. ఇంత పెద్దఎత్తున నష్టం అధికారుల వైఫల్యంతోనే సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తక్కిన వాటిల్లో తాగునీటికి 3.18 టిఎంసి, సాగునీటికి 6.986 టిఎంసిలు, 2.467 టిఎంసిలు స్టోరేజీ కింద నిలువ ఉంచారు. మొత్తంగా 12.467 టిఎంసిలు వినియోగంలో ఉన్నట్టు చూపుతున్నారు. అయితే ఇక్కడ ప్రవాహ నష్టంపైనే అనేక సందేహాలున్నాయి.వచ్చిన 15 టిఎంసిల్లో కేవలం 1.36 టిఎంసిలు మాత్రమే తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు వినియోగించారు. అందులోనూ ఆ నీటిని పిఎబిఆర్‌ డ్యాంలో నీటి నిలువకు వినియోగిస్తున్నారు. తక్కినదంతా హంద్రీనీవాకే వాడుతున్నారు. దీని ద్వారా సుమారు 60 చెరువులకు నీరిచ్చామని చెబుతున్నారు. అయితే చాలా చోట్ల నీటిని తమ చెరువులకు విడుదల చేయాలని రైతులు, ప్రజాప్రతినిధులు ఆందోళనలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకే అధిక ప్రాధాన్యాత ఇస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మామాట: పుష్కలంగా ఉన్న కొన్ని ప్రాంతాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు…

Leave a Reply