TRENDING NOW

పోల్ నెం. 22. తిరుమల ఆలయం ఆరు రోజుల మూత

పోల్ నెం. 22. తిరుమల ఆలయం ఆరు రోజుల మూత

 

భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది భక్తి. దానిని ఇతరులు నియంత్రించగలరా.. భక్తికీ భగవంతుని దర్శనానికీ రేషన్ ఉంటుందా..! దైవదర్శనం ఇపుడు కాదు, కొండకు, గుడికీ రావద్దు అనడానికి హక్కు ఎవరికి ఉంది? నిరంతరం భక్తజనసంద్రంగా, నిత్యకల్యాణం పచ్చతోరణంగా వెలుగొందే తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తులను ఏ కారణంతోనైనా రావద్దని చెప్పవచ్చా..? ఇంతకు ముందు ఎపుడైనా అలా జరిగిందా…! లేకపోతే ఇదే తొలిసారా..?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమల.. భక్తులకు పరమ పవిత్ర స్థలం.  వేయి సంవత్సరాలకు ముందు నుంచే భక్తుల పూజలందు కుంటున్న స్వామికి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది తప్ప భక్తుల నమ్మిక ఏమాత్రం తగ్గడం లేదు.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల మేరకు… తిరుమలలో కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి 1958 నుంచి వరుసగా ప్రతి 12 సంవత్సరాలకు ఒక సారి మహాసంప్రోక్షణ క్రతువు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఆగస్టు 12వ తేదీ నుంచి 18 తేదీ వరకు ఈ క్రతువు చేపట్టనున్నారు. ఆగస్టు 11 వతేదీన అంకురారోపణ తో క్రతువు లాంఛనంగా మొదలవుతుంది.   ఆరురోజులు పలు పూజలు, శాంతిహోమాలు నిర్వహిస్తారు. కనుక దర్శనానికి సమయం ఉండదనే కారణంగా భక్తులను ఆలయం లోనికి అనుతించబోవడం లేదు. ఈ  ఆరు రోజులూ భక్తులకు దర్శనం నిలిపి వేయాలని తితిదే ధర్మకర్తలమండలి శనివారం సమావేశమై నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో మహాసంప్రోక్షణ జరిగిన ఆయా సందర్భాలలో ఆలయంలోకి భక్తులను అనుమతించకపోవడం అన్నది జరగలేదు. మరిప్పుడు పాలక మండలి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?

ఆలయంలోకి బయటి నుంచీ ఎవరినీ రానీయకుండా కట్టడిచేసే అధికారం ధర్మకర్తల మండలికి ఉందా? గతంలో ఎన్నడూ, ఎవ్వరూ తీసుకోని విచిత్ర నిర్ణయాలను ప్రస్తుత పాలక మండలి ఎందుకు తీసుకుంటోంది? ఈ పాలక మండలి సాధరణ మైనదేనా, లేక ఇతర మతప్రభావాన్ని అంగీకరించే అధ్యక్షుల వైఖరికి అనుగుణంగా తిరుమల పవిత్రతను ఫణంగా పెట్టి స్వకార్యక్రమాలను జరిపించుకునే ప్రత్యేక పాలక మండలి కొండమీద కొలువు తీరిందా అని శ్రీవారి భక్తులకు అనుమానం కలుగుతోంది. ఎందుకు ఇంత దాపరికం, ఎందుకు ఇంత తెంపరితనం.  తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా తీరుపై  కోర్టు విచారణలు మొదలు కాక మునుపే పాపాల చిట్టాకడిగివేయాలనే ఆతురత ఇందులో దాగి ఉందా?

అలిపిరి దాడి ఘటనలో తనను శ్రీవారే ప్రాణాలతో రక్షించారు అని పలుమార్లు స్వయంగా ప్రకటించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు తిరుమల విషయంలో ఉదాసీనంగా ఉన్నారు.  శ్రీవారి ఆలయ నిర్వహణ భ్రష్టుపట్టిందని సగటు భక్తుడు నమ్మేవిధంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఏం దాగి  ఉంది. మొన్నటికి మొన్న దుర్గ గుడిలో క్షుద్రపూజలు జరిపించిందెవరు. ఆ అవసరం ఎవరికుంది. పాలకులకు తెలియకుండా ఇటువంటివి జరుగుతాయా… ఒక వేళ తెలిసే జరుగుతూ ఉంటే బాబు ఆంతర్యం ఏమిటి?!

సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి, దైవభక్తి ఉన్న వారు ఇలా దేవదేవునికి అపచారం జరుగుతోందని లోకం కోడై కూస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఎలా ఉండగలుగుతున్నారు.  తాను బలంగా నమ్మిన బంట్లు శ్రీవారి కొలువులో ఏళ్లతరబడీ పాతుకు పోయిన వారు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారా… ఇంత జరుగుతున్నా.. .. వివరాలుఅన్నీ తన డాస్ బోర్డులో ఉంటాయని నమ్మబలికే సీఎం కు తిరుమలలో జరుగుతున్నది తెలియకుండా ఉంటుందా? లేక తెలిసే జరుగుతోందా స్వామీ…!

దేవస్థానంలో ఇటీవల పలు వివాదాలు వార్తాపత్రికలలో పతాకశీర్షికలలో కనిపిస్తున్నాయి. గతంలో కూడా తితిదే లో వివాదాలు ఉన్నాయి. వేయికాళ్ల మండపం తొలగింపు వంటివి భక్తుల మనోభావాలకు విరుద్దమనే వాదన ఉండేది. కానీ ఈ మారు స్వయంగా శ్రీవారి అర్చక ప్రముఖుడు రమణ దీక్షితులు వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఆయన స్వయంగా  తిరుమలలో శ్రీవారి ఆభరణాలకు రక్షణలేదు, ఇప్పటికే పలు విలువైన వజ్రాభరణాలు దేశం దాటిపోయాయి అంటూ ప్రస్తుత పాలకులపై విమర్శలెక్కుపెట్టారు. స్వామివారి కి మహారాజుల నుంచీ పామరుల వరకూ ఎందరో ఇస్తున్న విలువైన కానుకలకు భద్రతలేదనీ దీనిపై సీబీఐ విచారణ జరగాలనీ డిమాండు చేస్తున్న విషయం తెలుసు. ఇక తిరుమల ఆలయంలో ఎంతో పవిత్రంగా భావించే ఆలయం పోటు(వంటశాలలో) తవ్వకాలు జరిగాయనీ, లక్షల కోట్ల విలువైన సంపద పాలకులు రహస్యంగా తరలించారనీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పద బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి టిటిడీ ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఇంతటి వివాదాస్పద సమయంలో, రాష్ట్ర పాలకులపై ఆరోపణలు వచ్చిన వేళ… తిరుమల ఆలయంలోకి ఎవరినీ అనుమతించకుండా నిషేదం విధించడం భావ్యమా… ఏదో జరుగుతోందన్న పుకార్లకు తాజా చర్య మరింత బలం చేకూర్చేదిగా లేదూ.. మహా సంప్రోక్షణ సందర్భాన్ని తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి పాలకులు వాడుకుంటున్నారనే వాదనకు ఊతమిచ్చినట్టుగా లేదూ… ఏమంటారు… ఆలయంలోకి భక్తులను అనుమతించకపోవడం భావ్యమా స్వామీ..

మామాట: దేవుడి దర్శనానికీ రేషనా స్వామీ.. ఏమిటో పాలకుల తీరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: