తెలంగాణలో ఆర్టీసీ మంటలు: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్…

Share Icons:

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తమ డిమాండ్లని నెరవేర్చాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులని కేసీఆర్ విధులనుండి తొలగించి కొత్తవారిని నియమించేందుకు సిద్ధమయ్యారు. ఇక కేసీఆర్ వైఖరికి నిరసనగా, ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు కరీంనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమ్మెకు బీజేపీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ తో పాటు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు ఆర్టీసీ కార్మికులతో పాటు సమ్మెలో కూర్చున్నారు.

ఈ సందర్భంగా సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. సంజయ్ ను తీసుకెళ్లకుండా పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుగా పడుకున్నారు. వారిని అడ్డుతొలగించి పోలీసు వాహనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. అయినా కిలోమీటర్ మేర పరుగులు తీసి వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. కార్మికులకు సంఘీభావం ప్రకటిస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.

ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీజేపీ కార్యకర్తల తోపులాటలో ఏసీపీ అశోక్ కుమార్ కిందపడిపోయారు. కానిస్టేబుళ్లు ఆయనను పైకి లేపారు. అయితే, బండి సంజయ్ మధ్యలో కలగజేసుకుని సర్దిచెప్పడంతో… పరిస్థితి అదుపులోకి వచ్చింది.

అటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో కార్మికులతో పాటు కలిసి జగ్గారెడ్డి హైదరాబాద్ కు బయలు దేరుతుండగా పోలీసులు అడ్డుపడి.. ఆయనను అరెస్టు చేశారు. సంగారెడ్డి శివారు పోలీస్ స్టేషన్ కు ఆయన్ని తరలిస్తున్నట్టు సమాచారం. జగ్గారెడ్డి అరెస్టును కాంగ్రెస్ నాయకులు ఖండించారు.

ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. టీఎస్సార్టీసీ కార్మికుల కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు అణిచివేస్తున్నారని టీ- కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈ నెల ‘21న చలో ప్రగతిభవన్’ కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. మంత్రుల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేసిన రేవంత్, ఈ నెల 19న నిర్వహించే రాష్ట్ర బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

 

Leave a Reply