తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న రచ్చ..మరోసారి సమీక్ష చేయనున్న కేసీఆర్….

Telangana RTC bus strike 3rd day: 48,000 employees face axe
Share Icons:

హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై విపక్షాలు విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కేసీఆర్ లక్ష్యంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.  ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు సీఎం యత్నిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తన బంధువులకు ఆర్టీసీ భూములను ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. హైదరాబాదులోని బీహెఈఎల్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులతో కలసి రఘునందన్ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ నిరంకుశ పాలనకు ముగింపు పలికేందుకు అన్ని కార్మిక, ప్రజా సంఘాలు రంగంలోకి దిగాయని రఘునందన్ అన్నారు. టీఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని… కార్మికులపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతిస్తుండటాన్ని… ఆర్టీసీ కార్మకుల సమ్మెతో ముడిపెట్టవద్దని సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతనేది రాజకీయపరమైన నిర్ణయమని తెలిపారు. ఆర్టీసీ కార్మకుల సమ్మెకు సీపీఐ పూర్తి మద్దతు పలుకుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలతో ఆర్టీసీ తీవ్ర సంక్షోభంలో ఉందనే విషయం అర్థమవుతోందని చెప్పారు. కేసీఆర్ మొండి వైఖరిని వీడాలని, సరైన దిశగా ఆలోచించాలని సూచించారు.

ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికులని మళ్ళీ ఉద్యోగాల్లో తిరిగి చేర్చుకునేదే లేదని చెబుతున్న కేసీఆర్ వెనక్కి తగ్గారు. తెలంగాణలో సమ్మెకు దిగి, ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు రాబోమని భీష్మించుకు కూర్చున్న దాదాపు 46 వేల మంది కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఓ వైపు సమ్మె కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే, కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా నేడు మరోసారి ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.

నిన్నటి రివ్యూ మీటింగ్ కు కొనసాగింపుగా నేటి సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు మరింత తీవ్రరూపం దాల్చింది. సగానికి పైగా బస్సులు డిపోలకు పరిమితం అయ్యాయి. విపక్ష పార్టీలు సైతం ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తూ, నిరసనలకు దిగుతున్నాయి.

 

Leave a Reply