TRENDING NOW

ముందుకు సాగని కారు ప్రచారం

ముందుకు సాగని  కారు  ప్రచారం
నిజామాబాద్, నవంబర్ 8,
అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత విభేధాలు నానాటికీ పెరుగుతుండటంతో ప్రచారంలో కారు ముందుకు కదల్లేక వెలవెలబోతుంది. కేవలం పార్టీ ప్రకటించిన అభ్యర్థి ఆయన ముఖ్య అనుచరులతో ప్రచారాన్ని సాగిస్తున్న తీరుతో మిగిలిన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి కావల్సిన అనుచర గణం, సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ అభ్యర్థి నోముల నర్సింహయ్య కేవలం తన వర్గానికి చెందిన వారికే ప్రాముఖ్యం కల్పిస్తున్నారని, వారంతా ప్రచారపర్వానికి కలిసి వచ్చేందుకు సుముఖత చూపడం లేదు.పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కేవలం తన సామాజిక వర్గానికి చెందిన వారికే పెద్దపీట వేశారనే భావన ఇతర పార్టీల నుంచి వచ్చిన కార్యకర్తల్లో నాటుకుపోయింది. దీంతో వారు ప్రచారానికి ఆయన వెంట సాగలేమంటు దూరంగా ఉంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ముఖ్యనాయకులు సైతం అభ్యర్థి వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జానారెడ్డిని ఓడించాలనే పట్టుదలతో వచ్చిన తమకు పార్టీలో సరైన ప్రాధాన్యం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా తమ పరిస్థితి తయారైందని ఆవేదన చెందుతున్నారు.ఈ కారణంగా సాగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. మంత్రి సమక్షంలో అంతా కలిసి పనిచేద్దామని బాస చేసిన నాయకులకు, కార్యకర్తలకు  మధ్య సయోధ్య కుదరకపోవడంతో  ప్రస్తుతం ఎవరికివారే యమునా తీరే అన్నచందంగా తయారయ్యారు. దీనివలన గ్రామాల్లో ఉన్న సగటు కార్యకర్తల పరిస్థితి మరింత దారుణంగా మారింది. గ్రామాల్లోకి ప్రచారానికి వస్తున్న నాయకులు కేవలం గ్రామస్థాయి నాయకులతోనే మంతనాలు చేసి వెళ్లడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.పార్టీకి మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలను కాదని వివిధ పార్టీల నుంచి వచ్చిన కొత్త వారికి అధిక ప్రాధాన్యత కల్పించడం కార్యకర్తల మధ్య మరింత దూరాన్ని పెంచింది.
దీంతో గ్రామాల్లో ప్రచార జోరు మరింత మందగించింది. ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైసస నాయకులు కూడా ప్రచారంలో  అంటిముట్టనట్లుగానే ఉండటం వీరిమధ్య దూరాన్ని తెలియజేస్తుంది. గత రెండు రోజులుగా రెండు వర్గాలకు చెందిన కార్యకర్తల, నాయకుల మధ్య వాట్సాప్‌లో మాటల యుద్ధం జోరందుకుంది. దీంతో వీరి మధ్య దూరం మరింత పెరుగుతుండటంతో  కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు.పార్టీ గెలుపే ముఖ్యమని అభ్యర్థి భావిస్తే ఈసమస్య ఇంత దూరం వచ్చేది కాదని అధికారపార్టీలో సీనియర్  నాయకులు ఒకరు చెబుతున్నారు. పార్టీలో అభిప్రాయ భేధాలు సర్వసాధారణమని వాటిని అభ్యర్థినే పరిష్కరించుకుని అందరిని కలుపుకుపోవాలని సీనియర్ నాయకులు వాపోతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే పార్టీకి కష్టకాలం తప్పదంటున్నారు. పార్టీలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించి అసంతృప్తిగా ఉన్న నాయకులను బుజ్జగించి గెలుపే లక్ష్యంగా ముందు సాగేలా అభ్యర్థి చొరవ చూపాలని కార్యకర్తలు చెబుతున్నారు.
ఎవరికి వారే అన్నట్లుగా ఉంటే టీఆర్‌ఎస్‌కు ప్రత్యర్థిగా ఉన్న జానారెడ్డిని ఓడించడం అసాధ్యమనే భావన కార్యకర్తల్లో నెలకొంది. ఇప్పటికైనా టీఆర్‌ఎస్ అభ్యర్థి పార్టీ ముఖ్యనాయకులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి అందరు కలిసి పనిచేసి పార్టీని గెలిపించే దశగా ముందు సాగాలని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు.
మామాట:  కారు అప్పుడే పాతబడిందా ఏమిటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: