కొంచెం ఇష్టం- కొంచెం క‌ష్టం

Share Icons:

కొంచెం ఇష్టం- కొంచెం క‌ష్టం

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుస‌రిస్తున్న విధానాలు కొన్నిభారత్‌కు అనుకూలంగా ఉంటున్నాయి. మ‌రికొన్ని గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డిన‌ట్లుగా అనిపిస్తున్నాయి.

అమెరికా ఫ‌స్ట్ అనే నినాదంతో అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన ట్రంప్‌, గెలిచిన త‌ర్వాత మాట త‌ప్ప‌కుండా అదే వైఖ‌రి కొన‌సాగిస్తున్నారు. అయితే అమెరికా ఫ‌స్ట్ అనే నినాద‌మే త‌ప్ప‌ని అమెరికా మేధావులు అంటున్నారు.

అమెరికా ప్ర‌పంచ దేశాల‌కు పెద్ద‌న్న పాత్ర‌ను ఇంత కాలం పోషిస్తున్న‌ద‌ని వారంటున్నారు.

అలా పెద్ద‌న్న పాత్ర పోషించాలంటే చాలా దేశాల‌కు బ‌హిరంగంగానూ, కొన్ని దేశాల‌కు లోపాయికారిగానూ సాయం చేస్తూనే ఉండాల‌ని వారు చెబుతున్నారు.

కొన్ని దేశాల సైనిక వ్య‌వ‌స్థ‌లు బ‌లోపేతం చేయ‌డం మ‌రి కొన్నింటిని బ‌ల‌హీన ప‌రచ‌డం లాంటివి అమెరికా చాలా కాలంగా చేస్తున్న ప‌ని.

ఈ ప‌నులు విడిచి పెట్టి అమెరికా ఫ‌స్ట్ అనే నినాదాన్ని కొన‌సాగిస్తే ప్ర‌పంచ దేశాల‌కు పెద్ద‌న్న అనే టైటిల్ పోతుంద‌ని ఆమెరికా మేధావులు ఆందోళ‌న చెందుతున్నారు.

వారు ఎంత ఆందోళ‌న చెందినా ట్రంప్ మాత్రం అమెరికానే ఫ‌స్ట్ అంటున్నారు.

అమెరికా ఫ‌స్ట్ విధానంలో భాగంగా పాకిస్తాన్‌కు అన‌వ‌స‌ర సాయం అవ‌స‌రం లేద‌ని ట్రంప్ నిర్ణ‌యించారు.

అంత‌కు ముందు బ‌రాక్ ఒబామానే ఈ నిర్ణ‌యానికి వ‌చ్చి పాకిస్తాన్‌కు తీవ్ర‌వాద నిర్మూల‌న‌కు ఇస్తున్న నిధుల్లో కోత విధించారు.

ఆ త‌ర్వాత అధ్య‌క్షుడైన ట్రంప్ పాకిస్తాన్‌కు నిధుల్ని పూర్తిగా నిలిపివేశారు.

ఇలా చేయ‌డం వ‌ల్ల పాకిస్తాన్‌, చైనాకు ద‌గ్గ‌ర కాగ‌ల‌ద‌ని అమెరికా మేధావులు హెచ్చ‌రించినా ట్రంప్ ప‌ట్టించుకోలేదు.

ఉగ్ర‌వాదంపై పోరాడేందుకు ఇచ్చే నిధుల‌ను అమెరికా నిలిపివేసినా పాకిస్తాన్ క‌నీసం ప్రాధేయ‌ప‌డ‌టం కాదు కదా అడ‌గ‌ను కూడా అడ‌గ‌లేదు.

అదే స‌మ‌యంలో చైనా పాకిస్తాన్‌కు ఇబ్బ‌డిముబ్బ‌డిగా నిధులు ఇచ్చేస్తున్న‌ది. ఈ వైఖ‌రిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అసంతృప్తిగా ఉన్నారని శ్వేతసౌధం వెల్లడించింది.

ఉగ్ర‌వాదం నిర్మూలనకు పాకిస్తాన్‌ తీసుకుంటున్న చర్యలపై ట్రంప్‌ ఏమాత్రం సంతృప్తిగా లేరని వైట్‌హౌస్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ రాజ్‌ షా తెలిపారు.

ఉగ్ర‌వాదుల‌కు స్వ‌ర్గ‌ధామం

పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని, ఉగ్రవాద నిర్మూలనకు పాక్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తూ ఇటీవల అమెరికా పాక్‌కు సాయాన్ని నిలిపేసిన సంగతి తెలిసిందే.

ఇస్లాంఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపడితేనే నిధులిస్తామని అమెరికా స్పష్టం చేసింది. అయినా పాకిస్తాన్‌ ప్రవర్తన ఏమాత్రం సంతృప్తికరంగా లేదు.

అమెరికా లేవనెత్తిన అంశాలపై పాకిస్తాన్‌లో పెద్దగా పురోగతి కనిపించడంలేదని రాజ్‌ షా పేర్కొన్నారు.

వైట్‌హౌస్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నకు రాజ్‌షా ఈ విధంగా సమాధానమిచ్చారు.

తమ యంత్రాంగానికి పాక్‌తో సంబంధాల విషయంలో కొంత స్పష్టత వచ్చిందని, పాక్‌ చర్యలకు తగిన సమాధానం చెప్పాలని నిర్ణయించినట్లు చెప్పారు.

పాకిస్తాన్‌పై అమెరికా ఇలా క‌ఠిన వైఖ‌రితో ఉండ‌టం భార‌త్‌కు క‌లిసి వ‌చ్చే అంశం.

ఇప్ప‌టికే కాశ్మీర్ అంశంలో అమెరికా భార‌త్ వాద‌న ప‌ట్ల సానుకూలంగా ఉంది.

పాకిస్తాన్‌తో ఇదే వైఖ‌రిని అమెరికా కొన‌సాగిస్తే భార‌త్‌కు అది మ‌రింత ఉపయుక్తంగా ఉంటుంది.

అమెరికా భార‌త్‌కు ప్ర‌త్యేకంగా సాయం చేయ‌క‌పోయినా పాకిస్తాన్ ప‌ట్ల విముఖ‌త‌తో ఉంటే చాలు. అదే భార‌త్‌కు అమెరికా చేసే పెద్ద సాయం.

 

English Summary: America took tough stand against Pakistan in controlling the terrorism. America recently stopped the aid to Pakistan in this regard. Even though Pakistan did not yielded to America, that is why the  President Donald Trump expressing his displeasure against Pak, The White House told.

Leave a Reply