హైదరాబాద్, 10 సెప్టెంబర్:
సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్లు కేటాయించడంతో.. టీఆర్ఎస్లో రాజకీయం వేడుక్కెతోంది. టికెట్లు తమకే ఇవ్వాలంటూ ఆశావహులు.. ఒత్తిళ్ల తీవ్రతను పెంచారు. పార్టీ కోసం పని చేసిన వారిని విస్మరించొద్దంటూ కొందరు విజ్ఞప్తులు చేస్తుండగా.. రెబల్‌గా పోటీ చేస్తామంటూ మరి కొందరు సవాళ్లు విసురుతున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థుల దిష్టిబొమ్మలు దహనం చేయగా.. మరికొన్ని చోట్ల నిరసనల ద్వారా తమ గళం వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
టికెట్లు తమకే ఇవ్వాలంటూ ఆశావహులు..
రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లిలో తాజా మాజీ ఎమ్మెల్యే గాంధీ అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ జగదీశ్వర్‌గౌడ్ అనుచరులు ఆదివారం మరోసారి సమావేశమయ్యారు. తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
నాంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థిగా స్థానికేతరుడైన ఆనందకుమార్‌ను ఎలా ప్రకటిస్తారని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు.ఈవిషయమై ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించారు. ఉప్పల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎ్‌సవీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.
కూకట్పల్లి అభ్యర్థి కృష్ణారావు తరఫున తాము ప్రచారం చేయబోమని నలుగురు కార్పొరేటర్లు, పలువురు సర్పంచ్‌లు తేల్చిచెప్పారు. మరోవైపు ఉప్పల్‌లో బేతి సుభాష్‌రెడ్డికి అనుకూలంగా కొందరు.. వ్యతిరేకంగా మరికొందరు వ్యవహరిస్తున్నారు. బాల్కొండ నుంచి తాను పోటీ చేయడం ఖాయమని ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి ప్రకటించారు.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోరలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సభలో ఆయన మాట్లాడుతూ బాల్కొండలో తన విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. తుంగతుర్తి టికెట్ స్థానికులకే ఇవ్వాలంటూ పలువురు నాయకులు మోత్కూరులో రాస్తారోకో చేశారు. జనగామలో ముత్తిరెడ్డి నిలబడితే.. చేజేతులా సీటు వదులుకోవాల్సి వస్తుందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.
చేర్యాలలో సీనియర్ నాయకుడు మండల శ్రీరాములు ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. ముత్తిరెడ్డి టికెట్‌ను రద్దు చేసి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి రాజయ్యకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ పల్లగుట్టలో నియోజకవర్గ నేతలు సమావేశమయ్యారు. పాలకుర్తిలో తక్కెళ్లపల్లి రవీందర్రావు… తమ అనుయాయులతో సమావేశం నిర్వహించారు.కరీంనగర్ జిల్లా మానకొండూర్ టికెట్‌ను రసమయి బాలకిషన్‌కు కేటాయించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
అభ్యర్థుల దిష్టిబొమ్మలు దహనం
టికెట్ ఆశించి భంగపడ్డ ఓరుగంటి ఆనంద్ అనుచరులు ముగ్గురు టవర్ ఎక్కి నిరసన తెలిపారు. నారాయణఖేడ్‌లో తాజామాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పలువురు నాయకులు ర్యాలీ నిర్వహించి, ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. నారాయణఖేడ్ టికెట్‌ను బీసీకే కేటాయించాలని డిమాండ్ చేశారు.
మధిర టికెట్ దక్కని బొమ్మెర రామ్మూర్తి ఆవేదన సభ నిర్వహించారు.పినపాక అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుకు ఓట్లు వేయకూడదని కొమ్మునకిరిపేటలోని 25 కుటుంబాలు నిర్ణయించాయి. సత్తుపల్లిలో టికెట్ దక్కని మట్టా దయానంద్ తన వర్గీయులను కలుసుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టీఆర్ఎస్ టికెట్‌ను కేటాయించాలని రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ, మనుమయ, స్వర్ణకార సంఘాలు, బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి.
మామాట: ఈ అసమ్మతి సెగలు చల్లారేదెప్పుడో…