మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కానున్న కవిత…

Share Icons:

హైదరాబాద్: ఒక్క ఓటమి రాజకీయ నాయకుడు పెట్టుకున్న ఎన్నో అంచనాలు తలకిందులు చేసేస్తుంది.  అలాగే ఓటమి దెబ్బకు కొందరు నేతలు వెంటనే బయటకొచ్చి తిరగగలుగుతారు కానీ, కొందరు మాత్రం బయటకు రాలేరు. ఇప్పుడు అదే పరిస్తితిలో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ కవిత ఉన్నారు. మొన్న 2014 లోక్ సభ ఎన్నికల్లో తొలిసారి నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన కవిత…మొన్న ఎన్నికల్లో మాత్రం కవిత ఘోరంగా ఓడిపోయింది. బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు.

అయితే ఓటమి దగ్గర నుంచి ఆమె బయటకు రావడం లేదు. రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. కేవలం కుటుంబంతోనే గడుపుతున్న తప్ప పెద్దగా బయటకు రావడం లేదు. కాకపోతే మొన్న బతుకమ్మ సంబరాల్లో ఆమె కొంచెం యాక్టివ్ గా అయ్యారు. కానీ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయారు. అటు ఆమె యాక్టివ్‌గా లేకపోవడంతో నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో కార్యక్రమాలు తగ్గిపోయాయి. నేతలు కూడా దాదాపు సైలెంటయ్యారు. ఇది ఇలాగే కొనసాగితే…పార్టీ దెబ్బతినే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో త్వరలో రాజకీయంగా వస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలనే ఆలోచనలో కవిత ఉన్నారని తెలుస్తోంది.

మున్సిపల్‌ ఎన్నికలు మరి కొన్ని రోజుల్లో రాబోతున్నాయి. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీలున్నాయి. ఈ స్థానాల్లో తిరిగి గులాబీ జెండా ఎగురవేయాలంటే కవిత రంగంలోకి దిగాల్సిందేనని పార్టీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానంటూ హామీ ఇవ్వడం ద్వారా పుసుపు రైతుల ఓట్లతో గెలిచిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తానిచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలం కావడంతో ఇప్పుడు ఇదే అంశం మునిసిపల్ ఎన్నికల ఎజెండాగా ప్రచారం చేసేందుకు టిఆర్ఎస్ సిద్దమవుతోందని సమాచారం.

నెల రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని అరవింద్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ హామీ నెరవేరకపోవడం, దాదాపు ఆరు నెలలు కావస్తుండడంతో ఎంపీపై పసుపు రైతులు కూడా అసంతృప్తిగా ఉన్నారని, దాన్ని ఓట్ల రూపంలో మలచుకోవడానికి కవిత రంగ ప్రవేశం దోహదపడుతుందని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి ఇప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న కవిత మళ్లీ ప్రచారంలోకి దిగితే అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ పాగా వేయడం ఖాయమని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి కవిత రీఎంట్రీ టీఆర్ఎస్ కు ఏ మేర కలిసొస్తుందో?

Leave a Reply