బందరులో త్రిముఖ పోరు తప్పదా…!

Share Icons:

మచిలీపట్నం, 11 ఫిబ్రవరి:

మరో రెండు నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలెచేందుకు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. అలాగే చాలా చోట్ల ఈ రెండు పార్టీలకి ధీటుగా పవన్ కల్యాణ్ జనసేన కూడా దూసుకెళుతుంది. తనకి బలం ఉన్న చోట్ల గట్టి అభ్యర్ధులని నిలిపి మిగతా రెండు పార్టీలకి చెక్ పెట్టాలని చూస్తోంది.

ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా రాజధానిగా ఉన్న బందరు(మచిలీపట్నం) నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఇక్కడ అధికార టీడీపీ నుండి మంత్రి కొల్లు రవీంద్ర మరోసారి బరిలోకి దిగడం ఖాయం. అలాగే వైసీపీ నుండి సీనియర్ నేత పేర్ని వెంకట్రామయ్య(నాని) పోటీలో ఉండనున్నారు. జనసేన కూడా వీరికి పోటీగా స్ట్రాంగ్ అభ్యర్ధిని నిలబెట్టాలని చూస్తోంది.

అయితే ఎంత లేదు అనుకున్న ప్రధాన పోరు టీడీపీ-వైసీపీల మధ్యే ఉంటుంది. ఇక టీడీపీ అభివృద్ధి కార్యక్రమాలు, పోర్టు పనులు ప్రారంభంతో ప్రజల్లోకి దూసుకెళుతుంది. వైసీపీ కూడా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకితని క్యాష్ చూసుకోవాలని చూస్తోంది. అలాగే ఎన్నికల ముందే పోర్టు పనులు మొదలుపెట్టడం కేవలం ఓట్ల కోసమే అని విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్లనుంది.

ఏది ఏమైనా పార్టీల గెలుపు ఓటములపై బందరు పోర్టు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2004లో పోర్టు హామీతో, వైఎస్ ప్రభావంతో ఇక్కడ పేర్ని గెలిచారు. ఇక ఆ తర్వాత 2008లో పోర్టుకి వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. దీంతో 2009లో మళ్ళీ పేర్ని గెలిచారు. కానీ తర్వాత వైఎస్ మరణం, రాష్ట్ర విభజన లాంటి అంశాలతో పోర్టు వెనక్కి వెళ్లింది. ఇక 2014లో పోర్టు హామీతో టీడీపీ నుండి కొల్లు రవీంద్ర గెలిచి మంత్రి అయ్యారు. ఇక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పోర్టు పనులు ప్రారంభించారు. మరి ఈ తరుణంలో ప్రజల ఎవరి వైపు ఉంటారో తెలియాలి.

మరోవైపు బందరులో పవన్ కల్యాణ్‌కి ఎక్కువమంది అభిమానులు ఉన్నారు. దీంతో ఈ సీటుని గెలుచుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ గెలిచే బలం లేకపోతే జనసేన చీల్చే ఓట్ల ప్రభావంతో గెలుపు ఓటములు తారుమారయ్యే అవకాశం ఉంది. ఇలానే 2009లో చిరంజీవి ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం కాంగ్రెస్‌లో లాభించింది. ఇక 2014లో పవన్ కల్యాణ్ టీడీపీకి మద్ధతు ఇవ్వడంతో కొల్లు 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు జనసేన ఒంటరిగా పోటీ ప్రభావం వలన టీడీపీకి నష్టం కలిగి వైసీపీకి కలిసిరావొచ్చు. మరి చూడాలి ఈ ఓట్ల చీలిక ప్రభావం ఎవరికి కలిసొస్తుందో…

మామాట: రసవత్తరంగా మారిన బందరు రాజకీయం….  

 

Leave a Reply