తిరుమలలో రోజుకొక ఆన్ లైన్ మోసం

Share Icons:

తిరుమల, ఆగస్టు 27,

తిరుమలలో ఆన్‌లైన్‌ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. నెలల తరబడి స్వామివారి సేవ కోసం ప్రయత్నాలు చేసే వారికి దొరకని భాగ్యం దొంగలకు దొరుకుతోంది. ఇంటి దొంగల సహకారంతోనే జరుగుతోందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం సామాన్య భక్తులకు అంత తేలిగా దొరకడం లేదు. అదే పలుకుబడి ఉన్న వారికి, టీటీడీలో పనిచేసే మరి కొందరు తలుచుకుంటే వెంటనే అయిపోతోంది. తాజా ఉదాహరణలే ఇందుకు నిదర్శనం. శ్రీవారి సేవలు పొందే వారి కోసం నెలలో మొదటి శుక్రవారం ఆ నెలకు సంబంధించి సేవా టికెట్లను విడుదల చేస్తారు. భక్తులు కావాల్సిన టికెట్టుకు తమ పేరు నమోదు చేసుకోవాలి. వారికి ఎలక్ట్రానిక్‌ లాటరీ పద్ధతిలో టికెట్లు కేటాయిస్తారు.

నెలల తరబడి ప్రతినెలా పేరు నమోదు చేసుకుంటున్నా ఒక్కసారి కూడా తమకు టికెట్టు దొరకలేదని డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమంలో భక్తులు పలుమార్లు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.ఇటీవల సోలాపూర్‌లో పట్టుబడిన దళారీ, తాజాగా తిరుపతిలో దొరికిన కాల్‌ సెంటర్‌ ఉద్యోగి వందల సంఖ్యలో సేవా టికెట్లు ఎలా పొందగలిగారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో పట్టుబడ్డ కాల్‌ సెంటర్‌ ఉద్యోగి ఈ నెలలోనే 16 టికెట్లు వచ్చాయని చెబుతున్నారు. అంటే తను ఎన్ని పేర్లు ఎలక్ట్రానిక్‌ లాటరీకి బుక్‌ చేసుకుని ఉంటాడు? ప్రతినెలా ఇదే విధంగా బుక్‌ చేస్తుండడం వల్లే అతనికి పదుల సంఖ్యలో టికెట్లు లభ్యమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఒక కంప్యూటర్‌ నుంచి లేదా ఒక నిర్ధిష్ట ప్రాంతం నుంచి వందల సంఖ్యలో టికెట్లకు పేర్లు నమోదు అవుతుంటే టీటీడీ ఐటీ విభాగం ఎందుకు గుర్తించలేకపోతోందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ విజిలెన్స్‌ అధికారులు పట్టుకోబట్టే ఆ దళారులు దొరికారని, ఐటీ విభాగం గుర్తించింది ఏమీ లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంత లోపభూయిష్టంగా ఉంటే ఆ సాఫ్ట్‌వేర్‌ను ఎలా విశ్వసించాలి? అసలు ఎలక్ట్రానిక్‌ లాటరీ సవ్యంగా ఉందని ఎలా నమ్మాలి? ఐటీ విభాగానికి, దళారులకు మధ్య లింకులున్నాయా అన్న అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు.

మామాట: దేవుని సన్నిధిలో పెరుగుతున్న దళారులు

Leave a Reply