ఉత్కంఠ మహా రాజకీయం: ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్కరోజే గడువు…

interest turns in maharashtra politics...
Share Icons:

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఫలితాలు వచ్చి 15 రోజులు దాటుతున్న బీజేపీ-శివసేనల మధ్య ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్దత కొనసాగుతూనే ఉంది. అధికారం పంచుకోవడంపై పంచాయితీ తేలకపోవడంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా రంగంలోకి పరిస్థితులు చక్కదిద్దే కార్యక్రమం చేపట్టారు.  శనివారంలోగా కొత్త ప్రభుత్వం కొలువు దీరకుంటే రాష్ట్రపతి పాలన తప్పనిసరి అయ్యే పరిస్థితుల్లో, బీజేపీ, శివసేన రాష్ట్ర నేతల మధ్య సమన్వయాన్ని కుదిర్చేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హుటాహుటిన మహారాష్ట్రకు చేరుకున్నారు.

తనకున్న అన్ని అపాయింట్ మెంట్లు, అధికారిక కార్యక్రమాలను క్యాన్సిల్ చేసుకున్న గడ్కరీ, నాగపూర్ కు వచ్చారు. ఆయన నేడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను ప్రత్యేకంగా కలుస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. నాగపూర్ లో మహారాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై పలువురు నేతలతో చర్చించనున్నట్టు నితిన్ గడ్కరీ, తన ప్రయాణానికి ముందు మీడియాకు తెలిపారు.

కాగా, ఫడ్నవీస్ స్థానంలో గడ్కరీని సీఎంగా ప్రతిపాదిస్తే, శివసేన నుంచి అభ్యంతరాలు ఉండక పోవచ్చన్న వార్తలూ వస్తున్నాయి. ఇరు పార్టీలకూ కావాల్సిన వ్యక్తిగా సీఎం పీఠంపై గడ్కరీని కూర్చోబెట్టాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. తాము సూచించిన విధంగా సీఎం పదవిని చెరి సగం పంచుకునేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ ఎంతమాత్రమూ అంగీకరించక పోవడంతో, అతన్ని గద్దెనెక్కించే పనే లేదని శివసేన తేల్చి చెబుతోంది.

అటు తన మిత్రపక్షం బీజేపీపై శివసేన సంచలన ఆరోపణలు చేసింది. తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజీపీ డబ్బులు ఎరజూపుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తన అధికారిక పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ధన బలంతో లాక్కునేందుకు కొందరు యత్నిస్తున్నారని తెలిపింది. రాజకీయ విలువలను దిగజార్చే ఇలాంటి చర్యలను శివసేన సహించబోదని చెప్పింది. రైతులకు గత బీజేపీ ప్రభుత్వం సాయం చేయలేకపోయిందని… అందుకే ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని తాము కోరుకుంటున్నామని తెలిపింది.

శివసేన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. బీజేపీ వైఖరిపై ఆ పార్టీ మిత్రపక్షమైన శివసేన పార్టీనే ఆందోళన చెందుతోందని… బీజేపీ ఎంతగా దిగజారిపోయిందో దీంతో అర్థమవుతోందని విమర్శించింది. మహారాష్ట్రను బీజేపీ నుంచి కాపాడాలని వ్యాఖ్యానించింది. అలాగే శివసేన ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ ఆ ప్రచారాన్ని ఖండించారు. ‘మా ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించాల్సిన అవసరం మాకు లేదు. మా నేతలు పార్టీకి కట్టుబడి స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఇటువంటి వదంతులను వ్యాప్తి చేస్తోన్న వారు ముందు వారి ఎమ్మెల్యేల తీరు గురించి ఆందోళన చెందాలి. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి శివసేన నుంచే ఉంటారు’ అని వ్యాఖ్యానించారు.

 

Leave a Reply