తెనాలిలో  ఈ సారి ఎగిరే జెండా ఏది?

tenali-triangle-fight-tdp,ysrcp-janasena
Share Icons:

తిరుపతి,ఏప్రిల్ 05,

తెనాలి అంటే ఆంధ్రాప్యారీస్… రాజకీయంగా ఉన్నత పదవులు అలంకరించిన ఉద్ధండులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం తెనాలి. ఇది కళలకు నిలయం. పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో కూడిన సంపన్నమైన ప్రాంతం. 110 సంవత్సరాల క్రితం పురపాలక సంఘంగా ఏర్పడిన ఘన చరిత్ర తెనాలికి ఉంది. కాగా తెనాలి, కొల్లిపర మండలాలతో 1952వ సంవత్సరంలో తెనాలి నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు తెనాలిలో 14 సార్లు ఎన్నికలు జరగ్గా 7 సార్లు కాంగ్రెస్, 5 సార్లు తెలుగుదేశం విజయం సాధించాయి. స్వతంత్రులు, జనతా పార్టీ అభ్యర్థులు ఒక్కోమారు గెలుపొందారు. 1982లో తెలుగుదేశం ఆవిర్భవించిన తరువాత 8 సార్లు ఎన్నికలు జరిగాయి. 5సార్లు టీడీపీ, మూడుసార్లు కాంగ్రెస్ విజయం సాధించాయి.  అటువంటి తెనాలి నియోజకవర్గంలో ఇప్పుడు త్రిముఖ పోరు నెలకొంది. గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం తరఫున ఆలపాటి రాజా, వైసీపీ నుంచి అన్నాబత్తుని శివ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా 19,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ముగ్గురే పోటీ చేస్తున్నారు. కాకపోతే నాదెండ్ల మనోహర్ జనసేన నుండిపోటీ చేస్తున్నారు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం తో పోటీ ఆసక్తికరంగా మారింది.

నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అందర్నీ కలుపుకొని పోవడం, బీసీ, ఎస్సీ, మైనారిటీలకు వెన్నుదన్నుగా నిలవడం ఆలపాటి రాజాకి కలిసొచ్చే అంశాలు. క్షేత్రస్థాయిలోనూ టీడీపీకి బలమైన నాయకులు, అనుచరగణం, ఎన్నికల ప్రచారంలో ముందు ఉండటం కలిసొచ్చే అంశాలు. ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు పార్టీ నుంచి వలస వెళ్లటం, పట్టణంలో ఒక వర్గానికి చేరువ కాలేకపోవటం, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు బలమైనవారు కావటం ప్రతికూలాంశాలు.

ఇక, జనసేన నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి, మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్రావు తనయుడు నాదెళ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధి, ప్రజలకు నేరుగా పనులు చేయటం, అన్ని వర్గాల వారితో సత్సంబంధాలు కలిగి ఉండటం మనోహర్ బలం. ముఖ్యంగా జనసేనను బలపరుస్తున్న సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశాలు. ప్రచారం సందర్భంగా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేసే నాయకులు లేకపోవటం, ఎన్నికలకు ఆలస్యంగా సన్నద్ధమవటం ప్రతికూలాంశాలు.

అలాగే, వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అన్నాబత్తుని శివ కుమార్‌కు గతంలో ఓడినా కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, 2014లో ఓడిపోయారనే సానుభూతి, స్థానిక సమస్యలపై పోరాటాలు, ప్రభుత్వ వ్యతిరేకత కలిసొచ్చే అంశాలు. బలమైన ద్వితీయ శ్రేణి నాయకులు లేకపోవటం, క్షేత్ర స్థాయిలో ఎన్నికల నిర్వహణ తెలిసిన కేడర్ లేకపోవడం ప్రతికూల అంశాలు. సో.. చూద్దాం, ఈ మారుఓటరు ఈ ముగ్గురిలో ఎవరిని కరుణిస్తారో…

మామాట:  మూడు ముఖాల పోటీలో మొగ్గు ఎవరికో

Leave a Reply