తుగ్లక్ అంటూ జగన్ 100 రోజులు పాలనపై విరుచుకుపడ్డ టీడీపీ నేతలు

main leaders ready to leave tdp
Share Icons:

అమరావతి:

ఏపీ సీఎం అధికార పీఠం అధిరోహించి 100 రోజులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఓ వైపు వైసీపీ నేతలు వంద రోజుల్లో జగన్ అద్భుత పాలన చేశాడని వైసీపీ నేతలు చెబుతుంటే మరోవైపు టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ వంద రోజుల పాలనల్లో రాష్ట్రానికి ఉపయోగపడే ఏ ఒక్క పనినీ చేయలేదని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ విమర్శించారు. అన్నా కాంటీన్లను రద్దు చేసి వాటికి సున్నం రాశారని, కమిషన్ల కోసమే రద్దులపై దృష్టి సారించారని తీవ్రంగా ఆరోపించారు. విధ్వంసాలు, దాడులు, రద్దులు తప్ప, ఈ వంద రోజుల్లో ఏం చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. నూరు రోజుల్లో మూడువందల తప్పులు, ఆరు వందల రద్దులతో ప్రభుత్వం నడిచిందని కళావెంకట్రావ్ విమర్శించారు.

అటు ప్రజల నమ్మకాన్ని ఏపీ సీఎం జగన్ వమ్ముచేశారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్‌ది పిచ్చి తుగ్లక్ పాలన అని, ప్రజల సొమ్మును వైసీపీ కార్యకర్తలకు దోచిపెట్టాలని చూస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో చేసిన పనులకు జగన్ రిబ్బన్ కట్ చేస్తున్నారని పేర్కొన్నారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేశారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా పనులు ప్రారంభించలేకపోయామని స్పష్టం చేశారు.

సీఎం జగన్ పాలన ‘తుగ్లక్ పాలన’ అని ప్రజల్లో ముద్రపడిపోయిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రంగా విమర్శించారు. వంద రోజుల్లో ఇంత దారుణంగా ప్రవర్తించిన సీఎం ఎవరూ లేరని మండిపడ్డారు. ప్రతిపక్షాల మీద కక్షసాధించే లక్ష్యంగా ఈ సీఎం ముందుకెళ్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర రాబడి మూడు శాతం వరకూ పడిపోయే ప్రమాదం ప్రస్తుతం ఉందని, ఇది అన్ని రంగాల మీద ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, దీంతో రాష్ట్ర ఆదాయం తగ్గిపోతోందని మండిపడ్డారు. ఏపీ ఆదాయం తగ్గి, పొరుగునే ఉన్న తెలంగాణ ఆదాయం పెరిగిపోతోందని వీటన్నింటికీ జగనే బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అదేవిధంగా సీఎంగా జగన్ వంద రోజుల పాలనను తుగ్లక్ పాలనగా పేర్కొంటూ.. తుగ్లక్ 2.0 సమస్యకి పరిష్కారం అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ‘‘జగన్ గారూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, హైదరాబాద్ రావడం ఖర్చుతో కూడుకున్నది అని కోర్టుకి కహానీలు ఎందుకు చెప్పడం, దోచుకున్న లక్ష కోట్లు రాష్ట్ర ఖజానాకి అప్పగిస్తే సరిపోలా !! రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, ఖజానా నిండుతుంది. అంతే కాకుండా, మీరు ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళ్లి రావడానికి అయ్యే భద్రత, రవాణా ఖర్చులకి, ప్రభుత్వానికి నిధులు కూడా సమకూరుతాయి. ఇంత సులువైన పరిష్కారం ఉండగా మినహాయింపు ఎందుకు మాస్టారు. శిక్ష ఎలాగో తప్పదుగా!’’ అంటూ లోకేశ్ తన ట్వీట్‌లో ఎద్దేవా చేశారు.

 

Leave a Reply