ఉత్తమ్ పక్కకు…టీపీసీసీ రేసులో ఆ ముగ్గురు…!

Share Icons:

హైదరాబాద్: వరుస ఓటములతో క్రుంగిపోయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. గత ఎన్నికలన్నీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పోటీ చేసి ఓటమి పాలైంది. కాకపోతే వరుస ఓటములు రావడంతో ఆయన పెసీసీ పదవికి ఎసరు వచ్చింది. అయితే ఉత్తమ్ కూడా బాధ్యతలనీ తప్పుకోవడానికి వెనుకాడటం లేదు. తాజాగా ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకే పీసీసీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పినట్లు తెలిసింది. తాజాగా ఢిల్లీ వెళ్ళిన ఆయన ఈ విషయాన్ని అధిష్టానానికి స్పష్టం చేసినట్లు సమాచారం.

దీంతో కాంగ్రెస్ అధిష్టానం కొత్త పీసీసీని వెతికే పనిలో పడింది. అయితే పీసీసీ రేసులో ముగ్గురు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం కూడా ఆ మూడు పేర్లని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందులో తొలి పేరు రేవంత్ రెడ్డి కాగా..ఆ తరువాత జానారెడ్డి..దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్లు వరసలో ఉన్నట్లుగా సమాచారం. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత టీపీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్‌రెడ్డి పేరును అధిష్ఠానం ప్రధానంగా పరిశీలించింది. అయితే పలువురు అభ్యంతరం తెలపడం, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు రావడంతో ఆ అంశాన్ని పక్కన పెట్టింది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక తర్వాత మళ్లీ ఈ ప్రచారం ఊపందుకుంది. బీసీ కోటాలో పీసీసీ చీఫ్‌ పదవిని ఆశిస్తున్న వి.హన్మంతరావు.. రేవంత్‌రెడ్డి అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాను కూడా పీసీసీ చీఫ్‌ రేసులో ఉన్నానంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు.

ఎస్సీని నియమించాలని భావిస్తే.. తనకు అవకాశం ఉంటుందని సంపత్‌ భావిస్తున్నారు. బీసీ కోటాలో మధుయాష్కీ సైతం ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. రేవంత్‌కు ప్రత్యామ్నాయంగా జానారెడ్డి పేరును కొందరు, వివాద రహితుడిగా పేరున్న శ్రీధర్‌బాబును మరికొందరు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి.. ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్‌ ఎంపిక అధిష్ఠానానికి సవాల్‌గానే మారింది. శ్రేణుల్లో ఉత్సాహం నింపాలంటే కొత్త సారథిని నియమించాలన్న ఆలోచనలో భాగంగా అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. అయితే రేసులో చాలామంది ఉన్న అధిష్టానం మాత్రం ప్రధానంగా రేవంత్, జానారెడ్డి, శ్రీధర్ బాబుల పేర్లే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా అధిష్ఠానం రేవంత్ రెడ్డిని ఎంపిక పైనే ప్రధానం ఫోకస్ చేసినట్లు సమాచారం. మరి చూడాలి త్వరలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారో.

 

Leave a Reply