ఈటెల మాటల తూటాలు: మొత్తం బయటపెడతా… కేటీఆర్ ఫోన్

etela rajendar sensational comments..ktr phone call to etela
Share Icons:

హైదరాబాద్:

గత కొన్ని రోజులుగా తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేబినెట్ విస్తరణలో భాగంగా ప్రస్తుత మంత్రి ఈటెల రాజేందర్ ని తొలగిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం నేపథ్యంలో మంత్రి ఈటెల ఘాటుగా స్పదించారు.   మంత్రి పదవి తప్పిస్తారనే వార్తలపై తీవ్రస్థాయిలో స్పందించారు. టీఆర్ఎస్ పార్టీలోకి తాము అడుక్కొని వచ్చినోళ్లం కాదని, తామే ఓనర్లమని వ్యాఖ్యానించారు.

తనకు వచ్చిన మంత్రి పదవి ఎవరి భిక్షో కాదని, వీరుడెవడో తెలిసే రోజు త్వరలోనే వస్తుందన్నారు. చిల్లరమల్లర వాదనలకు తాను భయపడే రకాన్ని కాదని మంత్రి స్పష్టం చేశారు. తానెప్పుడూ వెలిగే దీపాన్నేనని పేర్కొన్నారు. ఎవరైనా వచ్చి తనకు రూ.5 వేలు ఇచ్చానని చెబితే రాజకీయాల నుంచి తక్షణం తప్పుకుంటానని సవాలు విసిరారు.

తన ఆస్తులపైనా, తన వ్యక్తిగత జీవితంపైనా ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటికి సాయం అని వచ్చిన వారిని ఉత్తి చేతులతో పంపమని, ఇప్పటికీ తన భార్య, కొడుకు చద్ది కట్టుకుని పౌల్త్రీలో పనికి వెళ్తారని అన్నారు.

అయితే మంత్రి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపడంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్‌నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించినట్టు వార్తలు రావడంతో ఈటలకు కేటీఆర్ ఫోన్ చేసినట్టు సమాచారం. దీంతో గురువారం రాత్రికి తన వ్యాఖ్యలపై మంత్రి ఈటల రాజేందర్ ప్రకటన విడుదల చేశారు.

హుజూరాబాద్‌లో తాను మాట్లాడిన మాటలను కొన్ని వార్తా చానళ్లు, సోషల్ మీడియాలోని కొన్ని వర్గాలు వక్రీకరించాయన్నారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమ నాయకుడు కేసీఆరేనని స్పష్టం చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరిగిందని, తాను రూ.4 వేల కోట్లు సంపాదించానంటూ కరపత్రాలు, పోస్టర్లు ముద్రించి ప్రచారం చేశారని అన్నారు. హుజూరాబాద్‌లో తనను ఓడించేందుకు దొంగల గుంపు తయారైందని అన్నారు. అప్పట్లో సంపత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు.

ఇక పోలీసుల విచారణలో, తనకే పాపం తెలియదని, దీని వెనక పెద్ద కుట్ర ఉందని సంపత్ పోలీసులకు చెప్పాడని, తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొడుకులంతా కలిసి కుట్ర చేస్తున్నారని సంపత్ చెప్పాడని ఈటల వివరించారు. ఇక సంపత్ ఇంటరాగేషన్ రిపోర్టు మొత్తం తన వద్ద ఉందని, ఎవడెవడు ఏం చేసిండో సందర్భం వచ్చినప్పుడు మొత్తం బయటపెడతానని ఈటల చెప్పుకొచ్చారు.

Leave a Reply