పార్టీలు మారే పనిలో బిజీగా ఉన్న నేతలు…..

Share Icons:

హైదరాబాద్, 10 సెప్టెంబర్:

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సందర్భంగా అసంతృప్త జ్వాలలు మరింత పెరిగాయి. అటు టీఆర్ఎస్ లోనూ, ఇటు కాంగ్రెస్ పార్టీ లోనూ అసంతృప్త నేతలు బాగా ఎక్కువగా ఉన్నారు. దీంతో సీటు దక్కించుకోవడం కోసం అటు ఇటు పార్టీలు మారే పనిలో పడ్డారు.

ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్‌ని ఓడించి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఓ సీనియర్ నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజనాల శ్రీహరి పార్టీకి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సమర్థవంతమైన నాయకత్వ లేక ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నామన్న భావనలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముప్పై ఏళ్ళుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న ఆయన… ప్రస్తుతం వరంగల్‌ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా కూడా ఉన్నారు. శ్రీహరి తన అనుచరులతో కలిసి రెండు మూడు రోజుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస రెడ్డి ద్వారా గులాబీ కండువా కప్పుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇది ఇలా ఉంటే మరోవైపు చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం టీఆర్ఎస్‌కు షాకివ్వనున్నారు. చేవేళ్ల టిక్కెట్టు దక్కకపోవడంతో టీఆర్ఎస్‌ను వీడి  కాంగ్రెస్ పార్టీలో చేరాలని రత్నం నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు సోమవారం నాడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేఎస్ రత్నం సమావేశమయ్యారు.

2014 ఎన్నికలకు ముందు ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి కేఎస్ రత్నం టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. 2009 ఎన్నికల్లో రత్నం టీడీపీ అభ్యర్థిగా చేవేళ్ల నుండి పోటీ చేసి విజయం సాధించారు.  అయితే తెలంగాణాలో ఆనాడు నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  టీడీపీకి కేఎస్ రత్నం, పట్నం మహేందర్ రెడ్డి గుడ్ బై చెప్పారు.

మామాట: టికెట్ వస్తే చాలు ఏ పార్టీ అయితే ఏముంది

Leave a Reply