‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై తెలంగాణ సర్కార్ సరికొత్త ప్లాన్…

Share Icons:

హైదరాబాద్: ఆర్‌ఆర్‌ఆర్ అంటే రాజమౌళి సినిమా కాదు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందడానికి తీసుకొచ్చిన ‘రీజినల్ రింగ్ రోడ్’. అయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు ధీటుగా రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం చేయాలని కేసీఆర్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. అయితే హైదరాబాద్ చుట్టూ… 45 నుంచీ 50 కిలోమీటర్ల దూరంలో ఈ రింగు రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం అనుకుంది. ఈ రింగు రోడ్డు నిర్మాణం తర్వాత,  దీనికి రెండు వైపులా,  కొత్త నగరాల్ని ఏర్పాటు చేసి… మొత్తం తెలంగాణను అభివృద్ధి చెయ్యాలని సంకల్పించింది.

కానీ కేంద్ర ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా లేదు. రోడ్డు నిర్మాణానికి నిధులు ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్వయంగా సొంత నిధులతో దీన్ని చేపట్టాలనుకుంటోంది. రింగు రోడ్డును నిర్మించాలంటే, భూముల్ని సేకరించాలి. అది ఎలా అన్న అంశాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోంది. భూముల్ని సమీకరించాలా, లేక సేకరించాలా అన్నదానిపై అధికారులు త్వరలో రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ రింగు రోడ్డు నిర్మాణం దిశగా అడుగులు వెయ్యనుంది.

ప్రస్తుతం ఔటర్ రింగు రోడ్డు ఉంది కదా… దానికి 25 నుంచీ 30 కిలోమీటర్ల దూరంలో… ఈ రీజనల్ రింగు రోడ్డు రానుంది. మొత్తం 340 కిలోమీటర్ల రోడ్డు… ఆరు లేన్ల కింద నిర్మించనున్నారు. కేంద్రం ఎందుకు ఈ ప్రాజెక్టును ఒప్పుకోవట్లేదంటే, భారీ బడ్జెట్‌తో ఈ రోడ్డును నిర్మిస్తే, ఆ తర్వాత టోల్ అనేది ఓ 30 ఏళ్లపాటూ వసూలు చేసినా, పెట్టుబడి డబ్బులు రావని కేంద్రం అంటోంది.

అందువల్లే మరోసారి ఆలోచించుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించేందుకు సిద్ధపడుతూ,  భూ సమీకరణ చేస్తే ఎలా ఉంటుందనేది ఆలోచిస్తోంది. భూ సమీకరణ చేస్తే,  భూములు ఇచ్చిన వారికి ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వొచ్చని ప్రభుత్వం అనుకుంటోంది. అలా కాదనుకుంటే, భూమిని సేకరించి నిర్మించాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ ఆలోచిస్తోంది.

 

Leave a Reply