ఏపీలో తెలంగాణ మాజీ ఎమ్మెల్యే పోటీ…ఎక్కడంటే?

Share Icons:

కాకినాడ, 18 మార్చి:

ఏప్రిల్ 11న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెల్సిందే. ఇప్పటికే వైసీపీ అన్నీ స్థానాల్లో అభ్యర్ధులని ప్రకటించి ప్రచారంలో దూసుకెళుతుంది. అలాగే టీడీపీ కూడా ఒక 30 స్థానాలు మినహా అన్నీ స్థానాల్లో అభ్యర్ధులని ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఇక్కడ నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి బరిలోకి దిగుతున్నారు.

అయితే 2014లో పోలవరం ముంపు గ్రామాలు తెలంగాణలోని ఏడు మండలాలు ఆంధ్రాలో కలిశాయి. అందులో కొన్ని రంపచోడవరం పరిధిలోకి వచ్చాయి. ఇక వీటిల్లో సీపీఎం అభ్యర్థి, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య వూరు కూడా ఉంది. దీంతో రాజయ్య ఆంధ్రా ప్రాంతానికి వచ్చేశారు.

ఇక ఏపీలో జరగనున్న ఎన్నికల్లో రాజయ్య రంపచోడవరం నుండి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ ఆయనకి మంచి పేరుంది. దీంతో టీడీపీ, వైసీపీ, రాజయ్య మధ్య త్రిముఖ పోరు జరగనుంది. వీరితో పాటు కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ (ఎంఎంల్‌) న్యూడెమోక్రసీ, వైసీపీ రెబల్‌, పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. అయితే రంపచోడవరం నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు, పెరిగిన ఓటర్లు, నెలకొన్న సమస్యల నేపథ్యంలో ప్రధాన పార్టీ లు వాటిని లక్ష్యంగా చేసుకొని తమ విజయానికి అనుకూలంగా వాటిని మలచుకొనే పనిలో పడ్డారు. ఈ ప్రధానపోరులో టీడీపీ తరపున రాజేశ్వరి రెండోసారి విజయం సాధించాలని చూస్తున్నారు. సీపీఎంకు చెందిన సున్నం రాజయ్యకు ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం వుంది. మరి చూడాలి రంపచోడవరం ఓటర్లు ఎవరికి పట్టం కడతారో.

మామాట: ఆ విధంగా తెలంగాణ నేత ఏపీకి వచ్చారు అనమాట..

Leave a Reply