కాంగ్రెస్ లో రేవంత్ వన్ మ్యాన్ షో…మండిపడుతున్న సీనియర్లు…

Share Icons:

హైదరాబాద్: రేవంత్ రెడ్డి….తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ నాయకుడు. సీఎం కేసీఆర్ మీద ఒంటికాలి మీద వెళ్ళే నేత. అయితే కాంగ్రెస్ లో రేవంత్ దూకుడు…సీనియర్లకు నచ్చడం లేదని తెలుస్తోంది. పార్టీలో తమకంటే జూనియర్ అయిన రేవంత్.. చాలా విషయాల్లో తమను లెక్క చేయడం లేదని వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. నిన్న మొన్నటిదాకా హుజూర్‌నగర్ ఉపఎన్నిక విషయంలో రేవంత్‌కు,కాంగ్రెస్ నేతలకు మధ్య వివాదాలు బహిర్గతమైన విషయం తెలిసిందే.

అయితే రేవంత్ ఎట్టకేలకు ప్రచారానికి రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. కానీ తన ప్రచారం సందర్భంగా తనని తాను ఎక్కువగా చేసుకుని చెప్పుకున్నారని సీనియర్లు గుస్సా అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ప్రగతి భవన్ ముట్టడి’తో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడికిపిలుపునివ్వడంపై తమకెవరికీ సమాచారం లేదని కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, కోదండరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సహా పలువురు మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేశారు.

ఎవరిని సంప్రదించి రేవంత్ ముట్టడికి పిలుపునిచ్చారని ప్రశ్నించారు. దానికి తగ్గట్టు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముట్టడిలో పాల్గొనాలని మీడియా ప్రకటన ఇవ్వడమేంటని వాపోయారు. పార్టీలో రేవంత్ ఏకపక్ష నిర్ణయాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మొత్తానికి కాంగ్రెస్ లో రేవంత్ వన్ మ్యాన్ షో సీనియర్లకు అసలు నచ్చడం లేదు.

ఇదిలా ఉంటే సొంత పార్టీలో విభేదాల కారణంగా రేవంత్ తాను అనుకున్న పదవి సాధించలేకపోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. టీ పీసీసీ చీఫ్ పదవి కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న రేవంత్ రెడ్డికి… ఆ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు అడ్డుపడుతున్నారనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కూడా వారిపై తన మార్కు రాజకీయాలు ప్రయోగించాలని చూశారు. హుజూర్ నగర్‌లో ఉత్తమ్ సతీమణి పద్మావతికి బదులుగా తన వర్గం నాయకుడికి టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు.

అయితే కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగడంతో రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారు. కానీ ఇక్కడే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను వ్యతిరేకించిన పద్మావతి తరపున హుజూర్ నగర్‌లో ప్రచారం నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనే అంశం పక్కనపెడితే… అక్కడ రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రచారానికి మంచి స్పందన రావడం కాంగ్రెస్ శ్రేణులకు మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఇది రేవంత్ రెడ్డికి కచ్చితంగా కలిసొచ్చే అంశమే అని పలువురు అభిప్రాయపడ్డారు.

 

Leave a Reply