మరో 10 పేర్లతో కాంగ్రెస్ జాబితా

Share Icons:
హైదరాబాద్, నవంబర్ 14,
తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తాము పోటీచేసే స్థానాలకు గానూ తొలి విడతలో 65 పేర్లు ప్రకటించిన కాంగ్రెస్, బుధవారం ఉదయం మరో పది మంది అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మొత్తం కాంగ్రెస్ అభ్యర్థుల సంఖ్య 75కు చేరుకుంది. మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 94 నియోజకవర్గాల్లో పోటీ చేయనుండగా, టీడీపీ 14, సీపీఐ 3, టీజేఎస్ 8 చోట్ల పోటీ చేస్తున్నాయి. మేడ్చల్- కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, సిరిసిల్ల- కేకే మహేందర్ రెడ్డి, షాద్‌నగర్- ప్రతాప్‌రెడ్డి, జూబ్లీహిల్స్- విష్ణువర్దన్ రెడ్డి, భూపాలపల్లి- గండ్ర వెంకటరమణా రెడ్డి, ఖానాపూర్ (ఎస్టీ)- రమేశ్ రాథోడ్, ఖైరతాబాద్- డాక్టర్ దాసోజు శ్రవణ్, పాలేరు- కందాల ఉపేందర్ రెడ్డి, యల్లారెడ్డి- జాజుల సురేందర్, ధర్మపురి (ఎస్సీ) అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్లను ప్రకటించారు.
రెండో జాబితాలోనూ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడం గమనార్హం. వాస్తవానికి 28 మందితో కూడిన తుది జాబితాను బుధవారం ప్రకటిస్తారని వార్తలు వెలువడ్డా, అనూహ్యంగా పది మందితో రెండో జాబితా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. దీంతో మిగతా నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఉత్కంఠత నెలకుంది. తొలి జాబితాలో టికెట్‌ దక్కని ఆశావాహుల్లో కొద్ది మంది మంగళవారం నిరసనల చేపట్టారు. అలాగే టిక్కెట్ల కోసం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం, వార్‌ రూమ్‌ల వద్ద ఆశావాహుల తాకిడి అధికం కావడంతో ఎంపిక ప్రక్రియ కర్ణాటక భవన్‌‌లో సాగింది.
అభ్యర్థుల ఎంపికపై మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సమాలోచనలు జరిపి జాబితా రూపొందించారు. దీనిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదం కోసం పంపినట్టు వార్తలు వెలువడ్డాయి.
మామాట:  ఎవర్రా అక్కడ.. గాంధీభవన్ వద్ద ఫైర్ ఇంజన్ అలాగే ఉండనీ 

Leave a Reply