టీ.కాంగ్రెస్ లో ట్విస్ట్: రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చేస్తారా?

Share Icons:

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములు పాలవుతున్న నేతల మధ్య ఆధిపత్య పోరు మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా పీసీసీ పదవిపై ఎవరు తగ్గడం లేదు. పీసీసీ రేసులో నేను ఉన్నానంటే నేను ఉన్నానని ప్రకటనలు చేసేస్తున్నారు. త్వరలోనే పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతల నుంచి తప్పుకోవడం ఖాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి అధ్యక్షుడు ఎవరు అవుతారనే ఉత్కంఠ తెలంగాణ రాజకీయాల్లో సాగుతుంది.  పీసీసీ చీఫ్ పదవి విషయంలో ముఖ్యంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది.

అయితే వీరిలో కూడా శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డిలు పోటీలో ముందున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో రేవంత్ రెడ్డి క్రేజ్ బట్టి అతనికే ఇస్తారని అంతా అనుకుంటున్నారు. కానీ సీనియర్లు మాత్రం అయితే తమలో ఎవరోకరికి పదవి రావాలి గానీ రేవంత్ రెడ్డికి మాత్రం రాకుండా చూడాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వారం పది రోజుల్లో పీసీసీ చీఫ్‌ను మారుస్తారని, పీసీసీ చీఫ్ రేసులో తానే ముందున్నానని తెలిపారు కోమటిరెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తనకే మద్దతిస్తున్నారని వెల్లడించారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నానని.. దాని కోసం పార్టీ హైకమాండ్ అనుమతి కోరినట్లు చెప్పారు.

అటు జగ్గారెడ్డి సైతం తానూ పీసీసీ అధ్యక్షుడి పదవి రేస్‌లో ఉన్నానని పలు సందర్భాల్లో వెల్లడించారు. తనకు అవకాశమిస్తే పార్టీ బలోపేతం, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ సారి రెడ్డిలకు కాకుండా బీసీలకు పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వీహెచ్. అగ్రకులాల ఆలోచనల్లో మార్పు రావాలని.. బీసీల హయాంలోనే కాంగ్రెస్‌కు లాభం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. వీహెచ్ వ్యాఖ్యలపై తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

అయితే తెలంగాణలో సాదారణ ఎన్నికలకు మరో నాలుగేళ్లు సమయం ఉన్నందున మొదటి రెండు సంవత్సరాలు పీసిసి పదవిని వేరే వారికి అప్పగించాలని, ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందనగా పీసిసి తనకు అప్పగిస్తే ఫలితం ఏంటో చూపిస్తానని రేవంత్ రెడ్డి అధిష్టానానికి సూచించినట్టు తెలుస్తోంది. ఎన్నికల సందర్బంగా పీసిసి అప్పగిస్తే పార్టీని విజయతీరాలకు చేరుస్తాననే భరోసాను రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు.

కాకపోతే రేవంత్ రెడ్డి పైకి మాట్లాడకపోయిన తనకు పదవి వస్తుందనే ధీమాతో ఉన్నారు. కానీ సీనియర్లు మాత్రం రానిచ్చేలా కనపడటం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులని చూస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ కు హ్యాండ్ ఇచ్చేలాగానే కనిపిస్తోంది. మరి చూడాలి పీసీసీ పదవి ఎవరికి దక్కుతుందో.

 

Leave a Reply