రేవంత్ ని పొమ్మనలేక పొగబెడుతున్నారా? కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది?

Share Icons:

హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని సీనియర్ నేతలు ఎసరు పెడుతున్నారా? ఆయన్ని పొమ్మనలేక పొగ పెడుతున్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అతితక్కువ కాలంలో టీడీపీలో కీలక నేతగా ఎదిగిన రేవంత్…తర్వాత కాంగ్రెస్ లో చేరి ఎంపీగా గెలిచారు.

అయితే తెలంగాణలో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న రేవంత్ కు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ దానికి సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్ళి మరి రేవంత్ కు చెక్ పెట్టారు. సరే అక్కడితో వివాదం ఆగింది అనుకుంటే…తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక టికెట్ లొల్లి మొదలైంది. ఇప్పటికే హుజూర్ నగర్ టికెట్ తన భార్య పద్మావతికి కేటాయిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో రేవంత్ తన వర్గం తరుపున కిరణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రేవంత్‌రెడ్డి సొంతంగా అభ్య‌ర్థిని ఎంపిక చేసుకోవ‌డ‌మే కాకుండా ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపైన విమ‌ర్శ‌లు కురిపించాడు. దీంతో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎంపిక అటుంచి రేవంత్ రెడ్డికి ఎస‌రు తెచ్చేందుకు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ‌ర్గీయులు పావులు క‌దుపుతున్నార‌ని కాంగ్రెస్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే సీనియర్ నేతలంతా రేవంత్ పై విరుచుకుపడుతున్నారు. అది ఉత్తమ్ ఇష్టమంటూ వి‌హెచ్, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి లాంటి నేతలు మాట్లాడుతున్నారు. అలాగే యురేనియం తవ్వకాల ఉద్యమంపై రేవంత్ కాంగ్రెస్ నేతలనీ తీసుకుని పవన్ కల్యాణ్ తో భేటీ కావడాన్ని మాజీ ఎమ్మెల్యే సంపత్ తప్పుబట్టారు. అయితే రేవంత్ సంపత్ పై విమర్శలు చేశారు. దీనికి సంపత్ కూడా ప్రతిస్పందించారు. యురేనియంపై తనకు ఏబీసీడీలు తెలియకుండానే ఢిల్లీ వెళ్లి పోరాడానా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీగా ఉండి పవన్‌కు రిపోర్ట్ ఇవ్వడమేంటి అనడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. క్యారెక్టర్లు అన్నీ తనవే అని రేవంత్ అనుకుంటాడని.. కానీ కాంగ్రెస్‌లో అది సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇలా సీనియర్ నేతలంతా రేవంత్ టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్న తరుణంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ స్పందించింది. రేవంత్ శైలిని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి తప్పు పట్టారు. అసెంబ్లీలో మొదటి రెండు రోజులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరుతో పార్టీ గ్రాఫ్ పెరిగిందని… మూడో రోజు వచ్చి రేవంత్ మాట్లాడిన మాటలతో పార్టీ గ్రాఫ్ పడిపోయిందని ఆయన అన్నారు. శాసనసభలో ఎప్పుడు ఏం మాట్లాడాలనేది ఎమ్మెల్యేలే నిర్ణయించుకుంటారని చెప్పారు. యురేనియం అంశంలో ఏఐసీసీకి వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ లు ముందే నివేదిక ఇచ్చారని తెలిపారు. సంపత్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో రేవంత్ వ్యవహారంపై చర్చించామని… ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు.

 

Leave a Reply