హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెస్ అభ్యర్ధి ఖరారు..రేవంత్ వర్గానికి మొండిచెయ్యి

Share Icons:

హైదరాబాద్: తెలంగాణలోని హుజూర్ నగర్ ఉపఎన్నిక త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డికి అవకాశం దక్కింది. ఈ మేరకు ఆమె పేరును కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఆమెను పోటీకి దింపుతున్నట్టు పేర్కొంది.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ నల్గొండ ఎంపీగా గెలిచారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో హుజూర్ నగర్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక అభ్యర్ధి కూడా ఉత్తమ్ భార్య పద్మావతి పోటీలో ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో  కోదాడ నుంచి పోటీ చేసి ఆమె ఓటమిపాలయ్యారు. హుజూర్ నగర్ లో ఉపఎన్నిక పోరును కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపుపై ఇరుపార్టీల నేతలు ధీమాతో ఉన్నారు. టీఆర్ఎస్ తరపున సైదిరెడ్డి, బీజేపీ నుంచి శ్రీకళారెడ్డి పోటీ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి..హుజూర్ నగర్ టికెట్ తన వర్గం వారికి ఇప్పించుకోవాలని ప్రయత్నిచారు. కానీ ఇప్పుడు పద్మావతికి టికెట్ దక్కింది. హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారా ? లేక ప్రచారానికి దూరంగా ఉంటారా ? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డి పద్మావతి తరపున ప్రచారం చేయకపోతే… పార్టీలో అది వేరే రకమైన సంకేతాలను పంపుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తారన్నది అందరిలోనూ ఉత్కంఠగా మారింది.

అటు హుజూర్ నగర్‌లో పోటీ చేసే అంశంపై టీ టీడీపీ నేతలు ఎల్. రమణ అధ్యక్షతన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సమావేశమయ్యారు. అయితే దీనిపై నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండు మూడు రోజుల్లో దీనిపై తమ నిర్ణయం ఏమిటో చెబుతామని టీడీపీ నేత నర్సిరెడ్డి తెలిపారు. తెలంగాణలో మళ్లీ పార్టీని బలోపేతం చేసుకునే అంశంపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు… హుజూర్ నగర్‌లో పోటీపై త్వరలోనే పార్టీ శ్రేణులకు స్పష్టత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

 

Leave a Reply