అసెంబ్లీల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్: బడ్జెట్ హైలైట్స్…

telangana cm kcr introduce budget 2019-20 in assembly
Share Icons:

హైదరాబాద్:

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో ఆ రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. దేశ, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారుతున్న తరుణంలో… 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి రావడం పట్ల తాను చింతిస్తున్నానని తెలిపారు. జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని చెప్పారు. వాహనాలు కొనేవారు లేక ఆటోమొబైల్ రంగం కుదేలైపోయిందని అన్నారు.

దేశంలో స్థూల ఆర్థిక విధానాలను కేంద్ర ప్రభుత్వమే శాసిస్తుందని… కేంద్రం తీసుకొచ్చిన విధానాలను రాష్ట్రాలు అనుసరించడం మినహా మరో గత్యంతరం లేదని కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్థికశాస్త్ర మేధావుల సలహాలతో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు మేధోమధనం చేసి బడ్జెట్ ను రూపొందించారని తెలిపారు.

బడ్జెట్ లో ముఖ్య కేటాయింపులు…

2019-20 ఏడాది ప్రతిపాదిత వ్యయం రూ.1,46,492 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ.1,11, 055 కోట్లు

మూలధన వ్యయం రూ. 17,274 కోట్లు

మిగులు బడ్జెట్‌ అంచనా రూ.2,044 కోట్లు

ఆర్థిక లోటు రూ.24,081 కోట్లు

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలు రూ.1,82,017 కోట్లు

ఆసరా పెన్షన్లకు రూ.9,402 కోట్లు

గ్రామపంచాయతీలకు రూ.2,714 కోట్లు

మునిసిపాలిటీలకు రూ. 1,764 కోట్లు

విద్యుత్ సబ్సిడీలకు రూ.8 వేల కోట్లు

రైతు రుణాల మాఫీకి రూ.6 వేల కోట్లు

రైతుబంధుకు రూ.12 వేల కోట్లు

రైతు బీమా కోసం రూ.1125 కోట్లు

ఆరోగ్యశ్రీకి రూ.1,336 కోట్లు

కేసీఆర్ వైఫల్యాల పుస్తకం

ఇదిలా ఉంటే తెలంగాణ బడ్జెట్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. దీన్ని బడ్జెట్ అనడం కంటే… కేసీఆర్ వైఫల్యాల పుస్తకం అంటే బాగుంటుందని విమర్శించారు. ఆర్థిక మాంద్యం పేరు చెప్పి… తన వైఫల్యాలను సీఎం కేసీఆర్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. బడ్జెట్’లో సగానికి పైగా కేంద్రం ఆర్థిక విధానాలపైనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వృద్ధి పడిపోకుండా ఉండేందుకు తానేమీ చేస్తున్నాననే విషయాన్ని కేసీఆర్ చెప్పలేదని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా తెచ్చుకునే అవకాశం ఉన్నా… కేసీఆర్ ఆ పని చేయలేదని జీవన్ రెడ్డి ఆరోపించారు.

కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే తన కమీషన్ల లెక్కలు బయటకు వస్తాయని కేసీఆర్ భయపడుతున్నారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. బడ్జెట్ అంచనాలను భారీగా తగ్గించడం సీఎం కేసీఆర్ వైఫల్యానికి నిదర్శనమని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్థికంగా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 24 వేల లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా కేసీఆర్ తయారు చేశారని దుయ్యబట్టారు.

 

Leave a Reply