విజ్ఞాన ఖని   గురువు

Share Icons:

”  విజ్ఞాన ఖని   గురువు “

“మాతృదేవోభవ – పితృదేవోభవ – ఆచార్యదేవోభవ” అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. “గురువు” అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. “గు” అంటే చీకటి. “రు” అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. “గు” అంటే గుహ్యమైనది, తెలియనిది. “రు” అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. సాక్షాత్తూ భగవంతుడే తనకు మారుగా ఉపాధ్యాయుణ్ణి పంపిస్తే విద్యార్ధులు మాత్రం ఆయన్ను విస్మరించడం శోచనీయం. ప్రయత్నం మానవ లక్షణం. విద్యార్ధి చేసే ప్రతి ప్రయత్నానికీ గురువు ఆశీస్సులు ఉంటాయి, ఉత్సాహ ప్రోత్సాహాలుంటాయి. గురువు నుంచి వాటిని పొందడం ముందుగా విద్యార్ధి కర్తవ్యం. అది అతని బాధ్యత కూడా. బాధ్యతను విస్మరిస్తే భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడన వాస్తవాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం వారి బాధ్యత. ఒక కుటుంబంలాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నా గురువు నిర్వహించే బాధ్యత సాటిలేనిది. దేనితోనూ పోల్చడానికి వీలులేనిది. ఎందుకంటే గురువు జీవితాన్ని మారుస్తాడు. ఒక తల్లి లేదా తండ్రి తమ తమ కుటుంబాలపై ప్రభావం చూపవచ్చు. కాని ఒక గురువు బాధ్యత ఆ సమాజం పైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గురువు జాతీయ నిర్మాణకర్త కాబట్టి కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటాడు.

నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి అయినా ఆదియుగం నుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి. జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు. సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు. అతడే… ఉపాధ్యాయుడు, సృష్టి స్థితి లయల నిర్దేశకుడు! అలాంటి మహోన్నత మహాఋషికి నేటి సమాజంలో అడుగడుగునా ఆటంకాలే… వెటకారాలు, ఛీదరింపులు, వెండతెరపై ఆటపట్టింపులు… ఎదురుదెబ్బలు ఎన్ని తగిలినా… బుద్ధినే సిమెంటుగా, జ్ఞానాన్నే ఇటుకలుగా, వివేకాన్నే కాంక్రీటుగా మలిచి విజ్ఞానమనే భవంతుల్ని నిర్మిస్తున్న నిత్య శ్రామికుడు. నిత్యాణ్వేషిగా, నిత్య విద్యార్థిగా జ్ఞాన కుసుమాలు పూయిస్తున్న ఆ విజ్ఞాన ఖనిని మనసారా పూజించుకుందాం… మనసెరిగిన ఉపాధ్యాయులకు పాదాభివందనాలర్పిద్దాం…

గురు శిష్య సంబంధం చాలా ముఖ్యం. విద్యార్ధుల మనసును విశ్లేషించడంలో ఉపాధ్యాయుడు ఎంతో ముందుంటాడు. అందుకోసం ఆయన ఆ విద్యార్ధితో ఎంతో చనువుగా మెలుగుతాడు. స్నేహం చేస్తాడు. పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇదంతా జరగాలంటే ఆ ఉపాధ్యాయునికి ఎంతో సహనం అవసరం. అసహనం ఎదుటి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి శాంతానికి చిహ్నంగా ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ నిలిచివుంటాడు. అంతే కాదు ఉపాధ్యాయుడు విద్యార్ధుల భవిష్యత్తును సన్మార్గంలోకి తీసుకెళ్ళే చోదకునిగానూ, వారి మానసిక ఉన్నతికి పాటుపడే వైద్యునిగానూ, వివిధ రకాల పరిస్థితులను విడమరచి చెప్పడంలో శాస్త్రజునిగానూ, కలబోసి వివరిస్తూ ఆపైవచ్చే ఫలితాన్ని చూపేందుకు విశ్లేషకునిగానూ, అతనికి బలమైన నిర్మాణాత్మక శక్తినిచ్చేందుకు సమాజ నిర్మాతగానూ …ఇలా సంఘంలో ప్రతి వృత్తినీ తనలో ఇముడ్చుకొని, తానే అన్ని వృత్తులని నిర్వహించేవాడిగా విద్యార్ధికి సంపూర్ణ అవగాహన కలిగేట్లు చేస్తాడు. ఉపాధ్యాయ వృత్తి ఎన్నో ఉన్నత విలువలు కలిగిన వృత్తి. దేశానికి అధినేత అయినా, ప్రాణం పోసే వైద్యుడు అయినా, చట్టాన్ని పరిరక్షించే రక్షకభటులైనా, ఏ వృత్తిలోని వారైనా సరే ఒక ఉపాధ్యాయుని దగ్గర విద్యని అభ్యసించిన వారే.

పిల్లలు అతి సున్నిత మనస్తత్వం గల వాళ్ళు. కనుక ఉపాధ్యాయులు స్నేహభావంతో ఆదరించాలి. వారికి మన పట్ల భయం కాకుండా, స్నేహ భావం కలిగేలా చూసే బాధ్యత వారిది. విద్యార్ధి కూడా విద్యాలయంలో విద్య పూర్తికాగానే ఆ ఉపాధ్యాయునితో తనపని పూర్తై పోయిందనుకోకూడదు. విద్యాలయం నుంచి బైటికొచ్చాకే అతనికి ఉపాధ్యాయుడి సందేశం అవసరమవుతుంది. అప్పటివరకు కంటికి రెప్పలా చూసుకున్న ఉపాధ్యాయుని స్థానంలో అతనికి ఆ ఉపాధ్యాయుని సందేశం మాత్రమే తోడుగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుని నుంచి అప్పటివరకు తాను నేర్చుకున్న నడవడి, క్రమశిక్షణ మాత్రమే అతను పై అంతస్తులకు ఎదిగేందుకు దోహదపడతాయి. ఇప్పుడే విద్యార్ధి అత్యంత అప్రమత్తతతో తో నడుచుకోవాలి. ఇది అతని భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి తన గురువును తలుచుకుంటూ అడుగులేస్తే ఆ అడుగులు మరి అభ్యుదయంవైపే చకాచకా సాగుతాయనడంలో సందేహం లేదు.   దేశానికి నేత అయినా  గురువుకు విద్యార్ధియే. ఉపాధ్యాయుల దశానిర్దేశమే  లేకపోతే విద్యార్ధుల జీవితాలు చీకటి ప్రయాణాలు అవుతాయి. “విద్యకు విద్యార్ధులు అంకితం.  ఉపాధ్యాయులు విద్యార్ధులకు అంకితం”ఈ అవినాభావసంబంధంతోనే సంస్కారవంతమైన సమజనిర్మాణం” అని చెప్పిన భారత మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని” ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటున్నాం. మాజీ రాష్ట్రపతి డాక్టార్ ఏపిజె అబ్దుల్ కలాం కూడా ఉపాధ్యాయుడే!  —-

తల్లిదండ్రులిచ్చు మనకు భౌతిక దేహం, గురువేమో మన జగతికి చూపును దీపం. గురువనగా వెలిగేటీ మణిదీపమురా. గురి గల్గిన అతడిచ్చును ఙ్ఞానకాంతిరా! సుఙ్ఞాన మిచ్చి నిన్ను విఙ్ఞానిని చేయునురా, అఙ్ఞాన తిమిరమెల్ల బాయనతని చెంతరా!!

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply