అన్న క్యాంటీన్ల మూసివేతపై నిరసనలు: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతల ఫైర్.

tdpp leader bonda uma fires on jagan govt
Share Icons:

అమరావతి: వైసీపీ ప్రభుత్వం రాగానే గత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లని మూసివేసిన విషయం తెలిసిందే. అయితే క్యాంటీన్ల మూసివేతపై నేడు టీడీపీ నేతలు రాష్ట్రమంతా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తొమ్మిది నెలల్లో టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మండిపడ్డారు. సోమవారం ఉదయం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్రను బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న అన్న కాంటీన్ వద్ద పేదలకు అన్న దానం చేసి నిరసన తెలిపారు.

అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ అన్న క్యాంటిన్‌లో రూ.5కు భోజనం, టిఫిన్లు అందించామని, వైసీపీ ప్రభుత్వం రెండు రూపాయలకు అందిస్తారని అనుకుంటే మొత్తం ఎత్తివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు. టీడీపీ ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసిందని ధ్వజమెత్తారు.పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తివేయడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని బోండా ఉమ హెచ్చరించారు.

పేదల ఆకలితీర్చే అన్నా క్యాంటీన్ల మూసివేత అన్యాయమని  విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అన్నారు. ఆగష్టు 1 నుంచే అన్నాక్యాంటీన్లను తెరుస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పథకాల పేరుతో ఒక చేత్తో డబ్బులిచ్చి…మరో చేత్తో పన్నుల ధరలు పెంచి దోచుకుంటున్నారని రామకృష్ణ బాబు ఆరోపించారు. సోమవారం అన్నా క్యాంటీన్ల వద్ద టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పునియోజకవర్గం ఎంవీపీ రైతుబజార్ వద్ద వంటావార్పు కార్యక్రమం ద్వారా తమ నిరసనను తెలియజేశారు.

అన్నా క్యాంటీన్లను వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో వంటావార్పు నిర్వహించారు. గుత్తి రోడ్డు ఐదు లైట్ల సర్కిల్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనంత అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పాల్గొన్నారు. పేదలకు కడుపు నింపే అన్నా క్యాంటీన్లను వెంటనే తెరవాలని వారు డిమాండ్ చేశారు.

 

Leave a Reply