ఛలో పల్నాడు: టీడీపీ వర్సెస్ వైసీపీ: నేతల మాటల యుద్ధం

ap cm jagan recommended cbi inquiry on tdp former mla and chandrababu ready to help tdp leader
Share Icons:

అమరావతి:

తెలుగుదేశం పార్టీ ఈరోజు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పల్నాడు ప్రాంతంలో ఉన్న ఆత్మకూరులో వైసీపీ బాధితులని స్వయంగా తీసుకెళ్లి దింపడానికి చంద్రబాబు పూనుకున్న విషయం తెలిసిందే. అయితే పల్నాడులో 144 సెక్షన్ విధించిన ప్రభుత్వం టీడీపీ నేతలనీ ఎక్కడిక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది.

జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు ఛలో ఆత్మకూరు ఆపమని ఈరోజు కాకపోతే తర్వాతైన ఆ పని చేస్తామని చెప్పారు. ఇక టీడీపీకి కౌంటర్ గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.  .‘ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఇన్ని కుట్రలా? జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు. పల్నాడు వేధింపుల పేరుతో శిబిరాలు, నాణ్యమైన బియ్యం పైనా ఏడుపులు. వాలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపాలు. అసలు ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు చంద్రబాబు గారూ?’ అని ప్రశ్నించారు.

అటు విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డిని ‘420 తాతయ్యా’ అని సంభోదిస్తూ జగన్ ని తుగ్లక్ తో పోలుస్తూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. ‘మీ తుగ్లక్ (జగన్) గారికి  ఇంత అభద్రతాభావం ఉందని ఊహించలేదు. ఈ నిర్బంధాలు, మీడియా ఆంక్షలు నీ సలహానే కదా! 6 నెలల్లో మంచోడిని అనిపించుకుంటా అన్నాడు, 100 రోజులకే చేతులెత్తేశాడు. అయినా మీకు తెలిసింది ముంచడం ఒకటే కదా, ఇంకా మంచి ఎక్కడుంటుంది!’ అని విమర్శించారు.

ఇక పల్నాడులో శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేయడానికే టీడీపీ నేత చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ విమర్శించారు. ప్రజాస్వామ్యం అనే మాటను నోటి వెంట పలికేందుకు చంద్రబాబుకు అర్హత లేదని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి రాగానే 30 మంది వైసీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని జోగి రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వైఎస్ జగన్ 100 రోజుల పాలన కాలంలో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగలేదని స్పష్టం చేశారు.

పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం రౌడీయిజం చేస్తోందని చెప్పడానికి ఈ మాటలే నిదర్శమని ఓ వీడియోను టీడీపీ నేత నారా లోకేశ్ విడుదల చేశారు. టీడీపీ వాళ్లను బహిరంగంగా బెదిరిస్తున్న కాసు మహేశ్ రెడ్డిపై చర్య తీసుకునే దమ్ము పోలీసులు, హోంమంత్రికి ఉందా? అని సవాల్ విసిరారు. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామగ్రామాన, వీధివీధిన ఇలాంటి హెచ్చరికలే వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు టీడీపీ వెనక్కి తగ్గదని లోకేశ్ స్పష్టం చేశారు.

 

Leave a Reply