అసెంబ్లీలో టీడీపీ-వైసీపీ నేతల మాటల యుద్ధం…అంబటి సెటైర్లు..

tdp former mla ready join to ysrcp
Share Icons:
అమరావతి, 17 జూన్:

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈరోజు టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యంగా అంబటి రాంబాబు, అచ్చెన్నాయుడు మధ్యా వాడివేడి చర్చ జరిగింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారి గురించి అంబటి ప్రస్తావిస్తూ, “గెలిచేది తామేనని, రాసుకో రాసుకో రాసుకో… అని చెప్పిన వారెవరూ ఇక్కడ లేరు. ఒక్క అచ్చెన్నాయుడే ఉన్నారని,  ఆయనా రేపుండరు” అనగా, దీనికి అచ్చెన్నాయుడు తీవ్ర అభ్యంతరం లేవనెత్తారు.

ప్రజాస్వామ్యంలో ఓటమి సర్వసాధారణమని, ఓటమి పాలైన వారు అసమర్థులు కారని అన్నారు. అంబటి రాంబాబు కూడా వరుసగా ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చి, ఇప్పుడు గెలిచారని గుర్తు చేశారు. సభలో లేనివారి పేర్లు ప్రస్తావించడం ఎందుకని ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన అంబటి, ఓడిన వారు అసమర్థులు కారని అనుకోవడం ఓ ఓదార్పు వంటిదని, టీడీపీ నేతలు తమను తాము ఓదార్చుకునేందుకు ఇలాంటి మాటలంటున్నారని, ఓటమి ఓటమేనని అన్నారు.

ప్రజలు చంద్రబాబును తిరస్కరించారని, ఈ విషయాన్ని అంగీకరించాల్సిందేనని అన్నారు. ఆ సమయంలో మరోసారి అచ్చెన్నాయుడు కల్పించుకోబోగా, “ఐదుసార్లు గెలిచిన నాయుడుగారు… రెండుసార్లు గెలిచిన రాంబాబుకు అడ్డం వస్తే ఎలా అధ్యక్షా?” అని సెటైర్ వేశారు.

అసెంబ్లీలో అచ్చెన్నా జోరు…

అటు ‘మాట్లాడితే పట్టిసీమ వృథా, వృథా అని అధికార పక్షం సభ్యులు  విమర్శిస్తున్నారని, అది నిజంగా వృథా ప్రాజెక్టు అని వారు భావిస్తే ఈ ఏడాది రైతులకు నీరివ్వకుండా, వారి స్పందన ఏమిటో చూడాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తిచేస్తున్నాను’ అని అచ్చెన్నాయుడు అన్నారు.

అధికార పక్షం సభ్యులు ఎంతసేపు పట్టిసీమకు మా ప్రభుత్వం చేసిన ఖర్చునే చెపుతున్నారని, దానివల్ల ఒనగూరిన ప్రయోజనాలను కూడా చెబితే బాగుంటుందని చురకంటించారు. పట్టిసీమ నుంచి నీరివ్వకుంటే రైతుల ఆగ్రహం తెలిసి వస్తుందని, అప్పుడైనా వారికి ఆ ప్రాజెక్టు విలువ అర్ధమవుతుందని భావిస్తున్నానని అన్నారు.

Leave a Reply