టీడీపీ వర్సెస్ వైసీపీ: మాటల తూటాలు పేల్చిన నేతలు…

tdp former mla ready join to ysrcp
Share Icons:

అమరావతి:

తెలుగుదేశం-వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఈరోజు ఆయా సందర్భాల్లో టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేయగా…వైసీపీ నేతలు టీడీపీ నేతలపై విమర్శలు చేశారు.  మొదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం నాణ్యమైన బియ్యం రేషన్ షాపుల ద్వారా ఇస్తుంటే టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. దీంతో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

వైసీపీ నేతల కారుకూతలు నమ్మిన ఏపీ ప్రజలు జగన్ లోటస్ పాండ్ లో తినే బియ్యమే సరఫరా చేస్తాడనుకుని సంబరపడ్డారని బుద్ధా వెంకన్న తెలిపారు. కానీ 16 నెలలు చంచల్ గూడ జైలులో సాయిరెడ్డి, ఆయన బాస్ తిన్న చిప్పకూడు కంటే దారుణమైన బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి నాణ్యతలేని బియ్యాన్ని సరఫరా చేసి ఈరోజున నాణ్యమైన బియ్యం ఇచ్చామని ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని మండిపడ్డారు.

అటు మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విమర్శలు చేశారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ రాజకీయ బినామీ అని వ్యాఖ్యానించారు. అందుకే టీడీపీ గొంతుకను పవన్ వినిపిస్తున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణానికి మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. జగన్ వంద రోజుల పాలనకు 100 మార్కులు పడ్డాయని అన్నారు. అమరావతి నుంచి ప్రపంచ బ్యాంక్ తనంతట తానే వెనక్కి వెళ్లలేదని… రుణం వద్దని కేంద్ర ప్రభుత్వం సూచించడంతోనే తప్పుకుందని తెలిపారు.

ఇక బొత్స వ్యాఖ్యలకు టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయం విషయంలో కేంద్రం రాష్ట్రానికి ఎన్నో లేఖలు రాసిందని లోకేశ్ తెలిపారు. నెల రోజుల పాటు లేఖలు రాసిన కేంద్ర ప్రభుత్వం ‘ప్రపంచ బ్యాంకుకు మీ వైఖరి చెప్పండి’ అని ఆఖరి క్షణంలో కూడా హెచ్చరించిందని వెల్లడించారు. కానీ వైసీపీ ప్రభుత్వం అస్సలు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రుల మనోభావాలంటే ఏపీ సీఎం జగన్ గారికి అంత లెక్కలేనితనంగా మారిపోయాయని విమర్శించారు.

ఈ చర్య అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి జగన్ గారు పన్నిన కుట్ర కాకపోతే మరేంటని ప్రశ్నించారు. అసలు ప్రజలు కోరుకున్న రాజధాని నిర్మాణాన్ని ఆపే హక్కును ఏపీ ముఖ్యమంత్రికి ఎవరు ఇచ్చారని నిలదీశారు. ‘వందల కోట్లతో సొంత ఇంటిని కట్టుకున్న మీరు, రాష్ట్ర ప్రజల కోసం ఒక అద్భుతమైన రాజధాని అక్కర్లేదనే దుర్మార్గపు ఆలోచన ఎందుకు చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు.

Leave a Reply