ఇక టీడీపీ వారిని పట్టించుకోవాలని అనుకోవడం లేదా?

main leaders ready to leave tdp
Share Icons:

అమరావతి: తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం సంధికాలం నడుస్తుంది. మొన్న ఎన్నికల్లో చరిత్రలో లేని ఘోర ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీ ఇంకా కోలుకోలేకపోతుంది. వరుసగా ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు షాకులు ఇచ్చేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు పార్టీనీ వీడారు. ఇక తాజాగా వల్లభనేని వంశీతో ఎమ్మెల్యేలు జంపింగ్ కూడా మొదలైనట్లు కనబడుతుంది. అయితే వీటికన్నిటికి చెక్ పెట్టేందుకు టీడీపీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల తెలుగుదేశం పార్టీలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కృష్ణ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పార్టీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీని రెండుసార్లు ఆలోచనను విరమించుకోవాలని, వ్యక్తిగతంగా తాను అండగా ఉంటానని టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖలు రాసినప్పటికీ, వంశీని బుజ్జగించడానికి టిడిపి నేతలు ప్రయత్నం చేసినప్పటికీ వల్లభనేని వంశీ మోహన్ టిడిపిలో కొనసాగడానికి ససేమిరా అన్నారు. అంతటితో ఊరుకోక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై, నారా లోకేష్ పై, యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ పై నోటికొచ్చినట్టు మాట్లాడారు. భరించలేనంత పరుష పదజాలంతో దూషించారు. ఆ తర్వాత టీడీపీని వీడి జగన్ కు జై కొట్టారు.

ఆ తర్వాత టీడీపీలో యువనేత గా ఉన్న దేవినేని అవినాష్ పార్టీ మారడానికి నాలుగు రోజుల ముందు తన ఇంట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న యువ నేతలను అందరిని పిలిచి విందు ఏర్పాటు చేశాడు. ఈ విందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం హాజరయ్యారు. టిడిపిలోనే కొనసాగుతానని చెప్పిన దేవినేని అవినాష్ నాలుగు రోజుల్లో మాట మార్చాడు. టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీ కండువా కప్పుకున్నాడు. వీరికి టీడీపీలో ఎంత ప్రాధాన్యం దక్కిందో అందరికీ తెలుసు.

కానీ ఇక్కడ నుంచే టీడీపీ పాఠాలు నేర్చుకోవాలని అనుకుంటుంది. ఇక నుంచి  తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లాలనుకునే నేతలను బతిమిలాడాలనే, బుజ్జగించాలనే ఆలోచనకు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఆవిర్భావం నుండి నేటి వరకూ ఎన్నో సంక్షోభాలను చూసిందని, ఇక ఇప్పుడు కూడా అటువంటి సంక్షోభాన్ని చూస్తుందని, అంతమాత్రాన తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని, పార్టీ కోసం పని చేసే నాయకులు ఎప్పుడు పార్టీకి ఉన్నారని భావిస్తున్న టిడిపి అధినాయకత్వం పార్టీ వీడిని వెళ్లే నేతల విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. వారికి అసలు ప్రాధాన్యత ఇవ్వకూడదు అనుకుంటుంది. అలాగే కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ…స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటుంది.

ఈ విధంగా పార్టీని వీడే నేతల పనిలో కూర్చుంటే అధికార వైసీపీ మీద పోరాటం పక్కకు వెళ్లిపోతుందని భావిస్తున్నారు. ఏదేమైనా పార్టీని వదిలే వారిని ఇక నుంచి పట్టించుకోకూడదు అనుకుంటుంది.

 

Leave a Reply