టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత….

Share Icons:

విజయవాడ, 7 ఆగష్టు:

ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలు అందించిన టీడీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ బూరగడ్డ రమేశ్ నాయుడు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నిన్న సాయంత్రం ఆయన తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు.

పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం వల్ల రాజీనామా చేస్తున్నట్టు రమేశ్ తెలిపారు. పార్టీ ప్రతినిధిగా, ప్రజాప్రతినిధిగా 35ఏళ్ల నుంచి వివిధ స్థాయిల్లో అంకిత భావంతో పనిచేసినట్టు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు తమ సేవలను వాడుకుని ఇపుడు అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఇక రమేశ్ రాజీనామాతో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో అలజడి మొదలయ్యింది.

గతంలో రమేశ్ రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పోస్టయిన గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ గా పనిచేశారు. అలాగే 1999, 2004లో   జరిగిన ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అయితే ఆయన టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పార్టీనే అంటిపెట్టుకుని తన సేవలను అందించారు. ఇలా కృష్ణా జిల్లా టీడీపీలో సీనియర్ నేతగా ఎదిగారు.

ఇది ఇలా ఉంటే 2014 ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బురగడ్డ వేదవ్యాస్‌కి తాజాగా మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) చైర్మన్ పదవిని కట్టబెట్టారు. దీంతో ఇటీవలే పార్టీలో చేరిన వారికి కూడా పదువులిస్తూ ఎన్నో ఏళ్ల నుండి పార్టీనే నమ్ముకున్న తమను విస్మరించారని రమేశ్ మనస్థాపం చెంది రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

మామాట: గుర్తింపు లేని చోట ఉండకపోవడమే మంచిదేమో…!

Leave a Reply