రాజధాని కోసం ప్రజలంతా బయటకు రావాలి…

Share Icons:

విజయనగరం: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై టీడీపీ సీనియర్ నేత అశోక్‌ గజపతిరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గమ్మత్తైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. ఇక పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆపడం దుర్మార్గమని, ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నేతను అరెస్ట్‌ చేసే సంస్కృతి లేదని అన్నారు.

ఇక గతంలో వైఎస్‌, జగన్‌ పాదయాత్రలు చేస్తే అరెస్ట్‌లు జరిగాయా? అని ప్రశ్నించారు.  జగన్‌ ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెర తీసిందని, రాజధాని భూములు తిరిగి ఇచ్చేయడం సాధ్యమా?, అభివృద్ధిని అడ్డుకుని రివర్స్ గెర్లో నడుస్తున్న ప్రభుత్వమిది. రాజధాని ప్రాంతాన్ని ఎడారి, శ్మశానంతో పోల్చడం ఎంత వరకు సబబు. ఇది ఒక రాజకీయ పార్టీ సమస్య కాదు.. రాష్ట్రానికి సంబంధించిన సమస్య. రాజధాని కోసం ప్రజలంతా బయటకు రావాలి’ అని పిలుపునిచ్చారు.

ఇక చంద్రబాబును దుర్భాషలాడడం కొడాలి నాని మూర్ఖత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. జగన్‌ భావాలనే కొడాలి నాని బయటికి చెబుతున్నారని చెప్పారు. కొడాలి నాని టికెట్ కోసం.. చంద్రబాబు దగ్గర చేతులు కట్టుకొని నిలబడిన విషయం మర్చిపోవద్దని హితవు పలికారు. దమ్ముంటే రాజధాని గ్రామాల్లో జగన్‌ను పాదయాత్ర చేయాలని చెప్పాలన్నారు. అప్పుడు మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని తెలిపారు.

ఇక రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ సినీనటుడు పృథ్వీరాజ్‌ చేసిన వ్యాఖ్యలపై రాజధాని రైతులు భగ్గుమన్నారు. పృథ్వీరాజ్ దిష్టబొమ్మను చెప్పులతో కొడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమంటూ హెచ్చరించారు. రైతులను కించపరిచిన పృథ్వీరాజ్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మందడంలో పృథ్వీరాజ్‌ దిష్టిబొమ్మ దహనానికి రైతులు యత్నించగా, వారి పోలీసులు అడ్డుకున్నారు.

అటు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రాష్ట్రమంతా కోరుకుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వం కుంటిసాకులతో బస్సు యాత్రను అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వం బస్సు యాత్రను అడ్డుకుంటే ఫూల్స్‌ కిందే లెక్క అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. మచిలీపట్నం వెళ్లనివ్వకపోతే ప్రభుత్వంతో తేల్చుకుంటామన్నారు.

 

Leave a Reply