టీడీపీలోకి సబ్బం హరి!

Share Icons:

విశాఖపట్టణం, సెప్టెంబర్ 11,

ప్రజాభిప్రాయం, అనుచరులు, అభిమానుల సూచన మేరకు త్వరలోనే ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని మాజీ మేయర్‌ సబ్బం హరి ప్రకటించారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీదే విజయమని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు.. చంద్రబాబు కన్నా మంచి నాయకత్వం ఇస్తామన్న భరోసాను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు.రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌ కుక్కలు చింపిన విస్తరిగా తయారైందని, పార్లమెంట్‌లో ప్రజాసామ్యానికి చోటు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో బీజేపీ ఉనికే లేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయం, మోసాల గురించి ప్రజలకు వివరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా సఫలమయ్యారన్నారు. మోదీ గ్రాఫ్‌ పడిపోతున్నదని, బీజేపీకి ప్రజాదరణ తగ్గిపోతున్నదని హరి తెలిపారు.

క్రమశిక్షణ, అభివృద్ధి, ప్రజోపయోగం లక్ష్యాలుగా తాను రాజకీయ పదవులు నిర్వహించానని, భవిష్యత్తులోనూ అదే ఉద్దేశంతో తన నిర్ణయం ఉంటుందని చెప్పారు. మేయర్‌గా నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశానని, శివాజీపాలెం డంపింగ్‌ యార్డును తరలించి అక్కడ పార్క్‌ అభివృద్ధి ఇందుకు ఓ ఉదాహరణ అన్నారు.గ్రంథాలయం అభివృద్ధి, బీచ్‌ రోడ్డులో విగ్రహాల ఏర్పాటు తన హయాంలో జరిగినవేనని గుర్తు చేశారు. 2019లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని, అయితే ఏ పార్టీ తరపున అనేది త్వరలో తెలియజేస్తానన్నారు. అంతకన్నా ముందు రెండు నెలలపాటు జిల్లా అంతటా పర్యటించి, తన అభిమానుల సమావేశాలు నిర్వహిస్తానని చెప్పారు. తరువాత ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుని వెల్లడిస్తానని పేర్కొన్నారు.. విలువలు లేని రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయని, తాను మాత్రం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తానని చెప్పారు.

మామాట : ఇది రాజకీయ వలసలకాలం కదా, ఇంతే

Leave a Reply