జగన్ ప్రభుత్వం అలా చేయడం చాలా దుర్మార్గం…

Share Icons:

అమరావతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 28 వేల మంది వీఓఏలను తొలగించడం దుర్మార్గపు చర్యని,  ‘నేను పెట్టాననే అక్కసుతో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు.  డ్వాక్రా సంఘాలకు పార్టీలుండవని, వెలుగు వీఓఏలకు రాజకీయాలు తెలియవని, పేదరికం నుంచి విముక్తి చేసేందుకు, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు వాళ్లకు అవకాశాలు కల్పించాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

తన ముద్ర తొలగించాలనే కక్షతో 28 వేల మంది వీఓఏలను తొలగించి, వారి స్థానంలో వైసీపీ కార్యకర్తలను నియమించాలని చూడడం దుర్మార్గం, అమానుషమని చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటానికి తెలుగుదేశం అండగా ఉంటుందని, బాధితులందరికీ భరోసా ఇస్తామని తెలిపారు.

అటు లోకేశ్ కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 10 లక్షల మంది ఉద్యోగులపై వేటు వేశారని ఆరోపించారు. ‘నాలుగు లక్షల మంది వైకాపా కార్యకర్తలకు ఉద్యోగాలివ్వడం కోసం,10 లక్షల మంది ఉద్యోగులపై వేటు వేశారు జగన్ గారు. పాదయాత్రలో అక్క, చెల్లీ మీ జీతం పదివేల రూపాయలు చేస్తానన్న జగన్ గారు ఒకే ఒక్క సంతకంతో 27,700 మంది వెలుగు యానిమేటర్లని రోడ్ల పైకి నెట్టేసి, వారి జీవితాల్లో వెలుగు లేకుండా చేశారు’ అని ట్వీట్ చేశారు.

‘మహిళల్ని వేధించిన పాపం ఊరికే పోదు జగన్ గారు. ఒక్క ఉద్యోగం కూడా తియ్యడానికి వీలు లేదు. వెలుగు యానిమేటర్లకి అండగా మేము ప్రత్యక్ష పోరాటం మొదలు పెడతాం. మీరు ఇచ్చిన ఉత్తర్వులు తక్షణమే వెనక్కి తీసుకోవాలి. 27,700 యానిమేటర్లని తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.

అదేవిధంగా అగ్రి గోల్డ్ బాధితుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనబర్చుతోన్న తీరుపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. పాదయాత్రలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారంటూ వైసీపీ చేస్తోన్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు.  ‘ఆస్తులు కొనడానికి ముందుకొచ్చిన కంపెనీలను తమరు స్వయంగా బెదిరించారు గుర్తులేదా? అగ్రి గోల్డ్ గాయాన్ని పుండు చేసి ఆయింట్మెంట్ రాస్తున్నట్టు ఆ బిల్డ్అప్ లు ఆపండి. చిత్తశుద్ధి ఉంటే దగా యాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం వారంలో రూ.1,150 కోట్లు జగన్ గారితో విడుదల చేయించండి విజయసాయి రెడ్డి గారు’ అని డిమాండ్ చేశారు.

‘ఎటెట్టా ప్రజా దగా యాత్రలో ఇచ్చిన హామీని జగన్ గారు నిలబెట్టుకున్నారా? చంద్రబాబు గారు కేటాయించిన రూ.363 కోట్ల లో కోత పెట్టి రూ.264 కోట్లు మాత్రమే ఇచ్చారు. విజయవాడ, హైదరాబాద్ హోటల్స్ లో కూర్చొని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగకుండా కేసులు వేయించిన విషయం మర్చిపోయారా?’ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు.

 

Leave a Reply